TIME Most Influential People: ఆ జాబితాలో భారత ప్రధాని మోదీ, బంగాల్ బెబ్బులి దీదీకి చోటు
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి స్థానం దక్కింది. టైమ్ మ్యాగజైన్‌లో ఈ జాబితా ప్రచురితమైంది.
ప్రధాని నరేంద్రమోదీ, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. 2021 ఏడాదికి గాను అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రముఖ టైమ్ మ్యాగజైన్ ఈ జాబితాను విడుదల చేసింది. స్వతంత్ర భారతావనిలో మోదీ మూడో అత్యంత కీలక నేతగా సీఎన్ఎన్ జర్నలిస్ట్ ఫరీద్ జకారియా మోదీ ప్రొఫల్‌లో రాశారు.
దీదీకి చోటు..
భారత్ నుంచి ప్రధాని మోదీతో పాటు బంగాల్ సీఎం మమతా బెనర్జీకి కూడా ఈ జాబితాలో స్థానం దక్కింది. భారత రాజకీయాల్లో మమతా బెనర్జీ అత్యంత దూకుడు కలిగిన నేతగా ఫరీద్ అభివర్ణించారు. ఉద్యమ స్ఫూర్తి, నిరాడంబరత కలిగిన ఆమె స్వభావమే పురుష ఆధిక్య రాజ్యంలో మమతా బెనర్జీకి ప్రత్యేక స్థానం కల్పించాయన్నారు.
బైడెన్, బరాదర్..
టైమ్ మ్యాగజైన్ బుధవారం విడుదల చేసిన '100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు' జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ పేర్లు కూడా ఉన్నాయి.
బరాదర్ ప్రస్తుతం తాలిబన్ల ప్రభుత్వంలో ఉప ప్రధానిగా ఉన్నారు. 'ప్రజాకర్షణ కలిగిన సైనిక నాయకుడి'గా బరాదర్‌ను పేర్కొన్నారు.
సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) సీఈఓ అదర్ పూనావాలా పేరు కూడా ఈ జాబితాలో ఉంది.
ఇంకెవరున్నారంటే..
- అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్
- చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
- అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
- ప్రిన్స్ హారీ, మేఘన్
- ఇజ్రాయెల్ ప్రధాని నాఫ్తలీ బెన్నెట్
- రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్నీ
- అమెరికా రాజకీయ నేత లిజ్ చెనీ
- టెస్లా సీఈఓ ఎలన్ మస్క్
వీరితో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రేక్షకాదరణ ఉన్న పాప్ స్టార్లు, టీవీ యాంకర్లు, యాక్టర్ల పేర్లు కూడా కొన్ని ఉన్నాయి.
Also Read: Central Vista Project: నూతన రక్షణ భవనాలను ప్రారంభించిన ప్రధాని