Train New Rules : రైలు ప్రయాణమా ? ఇప్పటి వరకూ ఓ లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క.. తేడా వస్తే కేసే ! ఇవి తెలుసుకుంటే బెటర్
రైలు ప్రయాణికులకు కొత్త రూల్స్ తెచ్చింది రైల్వే శాఖ. అతిక్రమిస్తే కేసులు పెడతామని ప్రకటించింది. ఆ రూల్స్ ఏమిటంటే?
రైలు ప్రయాణమంటే టిక్కెట్ కొని ఇక్కడ రైలెక్కి ఎక్కడ దిగాలో అక్కడ దిగితే సరిపోతుంది కదా అని మీకు అనిపిస్తే వెంటనే అభిప్రాయం మార్చేసుకోండి. రైలు ప్రయాణం అంటే ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే కేసవుతుంది. ఎందుకంటే కొత్త రూల్స్ వచ్చేశాయి. ఆ రూల్స్‌లో ముఖ్యమైనది.. రాత్రి పది అవ్వగానే మీ సీటు దగ్గర లైట్ వెలుగుతూ ఉంటే మీకు బుక్కయిపోయినట్లే. రాత్రి 10 గంటల తర్వాత బోగీలో అన్ని లైట్లూ ఆర్పేయాలనేది కొత్త రూల్. ఈ నిబంధన పాటించని ప్రయాణికులపై రైల్వే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.
ఇదొక్కటే రైలు ప్రయాణంలో వర్క్ చేసుకోవచ్చు.. సినిమాలు చూసుకోవచ్చు అని అనుకోవచ్చు.. చేసుకోవచ్చు.. చూసుకోవచ్చు కూడా. కానీ దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే శబ్దం బయటకు రాకూడదన్నమాట. ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లలో పాటలు పెట్టి పెద్దపెద్ద శబ్దాలు చేయకూడదు. అంతే కాదు ఫోన్‌లో పెద్దగా మాట్లాడినా కేసు పెట్టేస్తారు. సాధారణ ప్రయాణికులతో పాటు గుంపులుగా ప్రయాణించే వారు సైతం రాత్రి పది గంటల తరువాత ఇతరులకు ఇబ్బంది కలిగించే రీతిలో బిగ్గరగా మాట్లాడితే అంతే సంగతులు.
మీరు ఇబ్బంది పెడుతున్నారని ఎవరైనా 139 నంబరుకు ఫోన్ చేస్తే చాలు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తక్షణం రంగంలోకి దిగిపోతుంది. వచ్చి వెంటనే చర్యలు తీసుకుంటారు. కేసు బుక్ చేస్తారు. బోగీల్లోని ఆర్‌ఫీఎఫ్ సిబ్బంది.. టికెట్ చెకర్లు, కోచ్ అటెండెంట్లు, క్యాటరింగ్ సహా ఇతర రైలు సిబ్బంది నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ప్రయాణికులు ఇతరుల పట్ల మంచి ప్రవర్తనతో ఉండేలా వీరు అప్రమత్తం చేస్తుంటారు. ప్రయాణికులకు అసౌకర్యం కలిగితే ఆ రైలు సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే నిబంధనలు కఠినంగా అమలు చేస్తారు.
రైళ్లలో ఇబ్బంది లేకపోవడం ఏమిటి.. అసలు రైలంటేనే ఇబ్బంది కదా అని చాలా మంది సాధారణ ప్రయాణికులు అనుకుంటూ ఉంటారు. అలా అనుకుని చాలా మంది రైల్వేకు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులన్నీ వినీ వినీ విసుగొచ్చేసిన రైల్వే శాఖ... రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేస్తామంటూ ఈ కొత్త నిబంధనలు రూపొందించింది. రైలులో తోటి ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలిగించినా కేసు నమోదు చేసి.. జైలుకు పంపాలని నిర్ణయించింది. అందుకే ఎందుకైనా మంచిది ఈ సారి రైలెక్కటప్పుడు ఈ నిబంధనలు అన్నీ గుర్తుంచుకుని రాముడు మంచి బాలుడు తరహాలో ప్రయాణించి గమ్యం చేరుకోవడం బెటర్. కాస్త తేడా వచ్చినా కేసుల పాలయిపోతాం.. బీవేర్ ఆఫ్ రైల్వేస్..!