KCR Discharge From Hospital: ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జి - మరికొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన
KCR: మాజీ సీఎం కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 8న ఆయన తన నివాసంలో గాయపడగా, చికిత్స అనంతరం కోలుకున్నారు. దీంతో శుక్రవారం డిశ్చార్జ్ చేశారు.
KCR Discharged From Yashoda Hospital: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) యశోద ఆస్పత్రి నుంచి శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం బంజారాహిల్స్ లోని నందినగర్ లో తన నివాసానికి వెళ్లారు. ఈ నెల 8న ఎర్రవల్లిలోని (Errvalli) తన వ్యవసాయ క్షేత్రంలో జారి పడడంతో ఆయన ఎడమ తుంటి భాగానికి గాయమైన విషయం తెలిసిందే. పరీక్షించిన వైద్యులు 9న ఆయనకు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. అనంతరం కేసీఆర్ వారం రోజుల వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. చికిత్స అనంతరం ఆయన కోలుకోవడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. మరో నాలుగైదు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆయన ఆస్పత్రిలో ఉండగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన్ను పరామర్శించారు. అటు, కేసీఆర్ చికిత్సకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు.
6 నుంచి 8 వారాల సమయం
ఈ నెల 8న ఎర్రవల్లిలోని తన నివాసంలో కేసీఆర్ జారి పడగా ఎడమ తుంటికి గాయమైంది. ఈ క్రమంలో సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి తరలించగా వైద్యులు 9న ఆయనకు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. ఈ క్రమంలో వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే కేసీఆర్ ఉన్నారు. అనంతరం కోలుకోగా ఆయన్ను నేడు డిశ్చార్జ్ చేశారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలంటే సుమారు 6 నుంచి 8 వారాలు పడుతుందని వైద్యులు చెప్పడంతో, నందినగర్ నివాసానికి తీసుకెళ్లి ఆయనను జాగ్రత్తగా చూసుకోవాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఇప్పటికే వాకర్ సాయంతో కేసీఆర్‌ను నడిపించారు డాక్టర్లు. కేసీఆర్‌కు ఆపరేషన్ నొప్పి తగ్గిందని, ప్రస్తుతం ఆయనకు సాధారణ నొప్పి మాత్రమే ఉందని యశోద ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నారన్నారు. కొన్ని రోజులు ఫిజియోథెరపీ కొనసాగించాల్సి ఉంటుంది.
కేసీఆర్ తన గాయం నుంచి కోలుకుంటుండగా.. పూర్తిగా రెస్ట్ తీసుకోవటానికి పరిమితం కావొద్దని వైద్యుల సూచనతో సమయం దొరికినప్పుడల్లా ఆస్పత్రిలో పుస్తకాలు చదువుతూ కనిపించారు. సాధారణంగానే.. చదవటం అంటే కేసీఆర్‌కు ఇష్టం. దీంతో ఇప్పడు ఆస్పత్రిలో ఖాళీగా ఉండటం ఇష్టం లేక.. ప్రముఖ పుస్తకాలు తెప్పించుకుని చదివారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట తాజాగా వైరల్ అయ్యింది. ఇదే సమయంలో కేసీఆర్ ను పరామర్శించేందుకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆస్పత్రికి తరలివచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సహా, మంత్రులు భట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, టీడీపీ అధినేత చంద్రబాబు, సినీ నటులు మెగాస్టార్, చిరంజీవి, నాగార్జున, ప్రకాష్ రాజ్ ఆయన్ను పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో ఆయన్ను చూసేందుకు ఆస్పత్రికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకోగా గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో కేసీఆర్ స్వయంగా తనను చూసేందుకు రావొద్దని, తాను క్షేమంగానే ఉన్నట్లు అభిమానులను ఉద్దేశించి ఓ వీడియోను విడుదల చేశారు. అయినా అభిమానుల రాక మాత్రం ఆగలేదు. దీంతో ఆస్పత్రి వద్ద భద్రత పెంచారు.