Akbaruddin Owaisi: కాంగ్రెస్ తో ఎంఐఎం జత కట్టిందా? ఘాటుగా స్పందించిన అక్బరుద్దీన్ ఒవైసీ
Telangana Assembly session 2023: హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే (MIM MLA) అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi)కి ఛాన్స్ ఇచ్చారు. ఎంఐఎంకి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చిందని.. ఇవన్నీ గమనిస్తే తెలంగాణలో, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అలయెన్స్ గా మారాయని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం ఎవరితోనూ పొత్తులో లేదని, ఒంటరిగానే పోరాటం చేస్తుందని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు.
అధికార కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం అలయన్స్ అన్న వార్తలు వచ్చాయని, కానీ అందులో నిజం లేదన్నారు. రెండు పార్టీల పొత్తు, అలయెన్స్ వార్తల్ని తీవ్రంగా ఖండించారు. సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని చెప్పారు. ఇకపైనా తెలంగాణ సీఎంను కలుస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పులు చేసినప్పుడు ప్రశ్నించాం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ప్రజలకు మంచి జరిగితే కాంగ్రెస్ సర్కార్ ను సైతం ప్రశింసిస్తూ మద్దతు తెలుపుతామని, మేలు జరగలేదు, హామీలు అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తామన్నారు.
పాతబస్తీ అభివృద్ధిపై కొత్త ప్రభుత్వం ఫోకస్ చేయాలి
కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు దగ్గరగా ఉండటానికి కారణం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణమన్నారు. ఆయన హయాంలో మైనార్టీలకు న్యాయం జరిగిందని అక్బరుద్దీన్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు ఈ ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా గెలింపించలేకపోయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ 2 పార్టీలు ముస్లింల అభివృద్ధికి సహకరించడం లేదని అక్బరుద్దీన్ ఆరోపించారు. పాతబస్తీలో రోడ్ల వెడల్పు పనులు పెండింగ్‌లో ఉన్నాయని.. కొత్త ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తమ సమస్యల పరిష్కారంపై, అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. డీఎస్సీలో ఉర్దూ పోస్టులను సైతం భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. పెండింగ్‌లో ఉన్న షాదీ ముబారక్ దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.