Siddaramaiah: ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్ వల్లే కర్ణాటకకు ఈ గతి పట్టింది - సిద్దరామయ్య ఫైర్
Siddaramaiah: ప్రధాని మోదీ కారణంగానే కర్ణాటక నష్టాల్లో కూరుకుపోయిందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు.
Siddaramaiah Slams BJP:
బీజేపీపై ఆగ్రహం..
కర్ణాటక ముఖ్యమత్రిగా సిద్దరామయ్య అలా బాధ్యతలు తీసుకున్నారో లేదో...అప్పుడే గత ప్రభుత్వంపై విమర్శలు మొదలు పెట్టారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తమ ప్రభుత్వం నడుచుకుంటుందని స్పష్టం చేసిన ఆయన..5 హామీలనూ ప్రస్తావించారు. ఆ హామీలకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని వెల్లడించారు. కేబినెట్ మీటింగ్‌లో వాటిపై ఆమోద ముద్ర వేసి చట్టాలుగా చేస్తామని తెలిపారు.
"ఎన్నికల మేనిఫెస్టోలో మేం 5 హామీలు ఇచ్చాం. తొలి కేబినెట్ మీటింగ్‌లోనే వాటిని ఆమోదిస్తాం. కచ్చితంగా అమలు చేస్తాం. మరో వారం రోజుల్లో ఇందుకు సంబంధించిన పూర్తి రూట్‌మ్యాప్‌ని ప్రకటిస్తాం"
- సిద్దరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి
ఈ సమయంలోనే గత బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు సిద్దరామయ్య. "ఎందుకూ పనికి రాని ప్రభుత్వం" అంటూ తీవ్రంగా మండి పడ్డారు. రాష్ట్రానికి వచ్చే పన్ను వాటాలు కూడా సరిగా రాలేదని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మలా సీతారామన్ కారణంగానే కర్ణాటక ప్రజలు నష్టపోయారని ఆరోపించారు.
"ఫైనాన్స్ కమిషన్ సూచనల మేరకు కర్ణాటక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.5,495 కోట్లు రావాల్సి ఉంది. కానీ...గత ప్రభుత్వం ఈ నిధులు ఇవ్వలేదు. కర్ణాటక నుంచే రాజ్యసభ ఎంపీగా ఉన్నారు నిర్మలా సీతారామన్. అయినా...నిధులు తెప్పించలేకపోయారు. ప్రధాని, నిర్మలా సీతారామన్ కారణంగానే కర్ణాటక ఇలా నష్టాల్లో కూరుకుపోయింది. మా ప్రభుత్వం ఇలా కాదు. మేం ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తాం"
- సిద్దరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, డిప్యుటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎప్పుడెప్పుడా అని కాంగ్రెస్ అభిమానులంతా ఎదురు చూసిన ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. కంఠీరవ స్టేడియం వేలాది మంది కార్యకర్తలతో నిండిపోయింది. సిద్దరామయ్య, శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఒక్కసారిగా జనమంతా కేరింతలు కొట్టారు. చాలా సేపటి వరకూ ఆ ప్రాంతం వాళ్ల అరుపులతో మారుమోగింది. ఈ కార్యక్రమానికి కీలక నేతలు హాజరయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా వేదికపై సందడి చేశారు. ప్రముఖ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ కూడా వేదికపై కనిపించారు. అయితే...ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కనిపించలేదు. సిద్దరామయ్య, డీకేతో పాటు 8 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు.
Senior Congress leader Siddaramaiah takes oath as the Chief Minister of Karnataka in Bengaluru. pic.twitter.com/9VUBNNsuv2
— ANI (@ANI) May 20, 2023
మే 13న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 135 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. మరుసటి రోజు ఆదివారం (మే 14) సాయంత్రం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశమై నాయకుడిని ఎన్నుకోవడానికి బదులు ఓ తీర్మానం చేసి అధినాయకత్వానికి పంపింది. ఏకవాక్య తీర్మానం చేసి శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే హక్కును కాంగ్రెస్ అధ్యక్షుడికి అప్పగించారు. చాలా రోజుల సస్పెన్స్ తరవాత సిద్దరామయ్య పేరు ఖరారు చేసింది హైకమాండ్.
Also Read: Rahul Gandhi: మా హామీలన్నీ త్వరలోనే చట్టాలవుతాయ్,పేదలే మమ్మల్ని గెలిపించారు - రాహుల్ గాంధీ