Surat water tank: 21 కోట్లు పెట్టి ట్యాంక్ కట్టారు - నీళ్లు నింపగానే కూలిపోయింది - బీహార్‌లో కాదు సూరత్‌లో!
Water tank collapses: బీహార్‌లో వంతెనలు ప్రారంభించగానే కూలిపోయాయన్న వార్తలు వింటూ ఉంటారు. ఇప్పుడు గుజరాత్ లోనే సూరత్ లో అలాంటిదే జరిగింది.

Water tank collapses on first fill shatters like a pot : గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో రూ. 21 కోట్ల ప్రజా ధనంతో నిర్మించిన భారీ నీటి ట్యాంక్, ప్రారంభోత్సవానికి ముందే పేకమేడలా కూలిపోయిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
గుజరాత్‌లోని సూరత్ జిల్లా మాండవి తాలూకా తడ్కేశ్వర్ గ్రామంలో ఈ ఘోరం జరిగింది. సుమారు 33 గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో గేపగ్లా గ్రూప్ వాటర్ సప్లై స్కీమ్ కింద రూ. 21.04 కోట్ల వ్యయంతో నిర్మించిన ఓ భారీ ఓవర్ హెడ్ నీటి ట్యాంక్, మొదటిసారి నీటిని నింపిన నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. సోమవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో, ట్యాంక్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు 9 లక్షల లీటర్ల నీటిని నింపగా, అది భారం భరించలేక ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన సమయంలో నీటి తాకిడికి చుట్టుపక్కల ప్రాంతాలు జలమయం కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 15 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ట్యాంక్ కూలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇది కేవలం నీటి ట్యాంక్ కూలడం కాదు, బీజేపీ ప్రభుత్వ అవినీతికి నిదర్శనం అంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. నీటిదే తప్పు అన్నట్లుగా ఉంది అంటూ నెటిజన్లు అధికారుల నిర్లక్ష్యంపై వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. 70 ఏళ్ల పాత ట్యాంకులను కూల్చడానికి జేసీబీలు కష్టపడుతుంటే, కోట్లు ఖర్చు చేసిన కొత్త ట్యాంక్ ఇలా నీరు నింపగానే కూలిపోవడం నాణ్యతా లోపాలను ఎత్తిచూపుతోంది.
In a shocking incident in Surat’s Tadkeshwar village, a newly built overhead water tank collapsed during a strength test right after being filled with water.
— Mojo Story (@themojostory) January 21, 2026
The massive tank — which cost over ₹21 crore and was supposed to supply drinking water to dozens of surrounding villages… pic.twitter.com/ScvPwPtSmG
ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం సీరియస్ అయింది. విచారణలో భాగంగా ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేయడంతో పాటు, ఈ ప్రాజెక్టును చేపట్టిన జయంతి సూపర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. కాంట్రాక్టర్‌పై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. నిర్మాణంలో వాడిన మెటీరియల్ నమూనాలను సేకరించిన ఎస్‌వీనిఐటీ ప్రొఫెసర్లు, ల్యాబ్ పరీక్షల కోసం పంపారు. మూడేళ్ల పాటు ఈ ప్రాజెక్టు కోసం ఎదురుచూసిన గ్రామస్థులు, ఇప్పుడు మళ్ళీ తాగునీటి కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ ఈ ట్యాంక్ ప్రారంభోత్సవం తర్వాత, నివాస ప్రాంతాలకు సరఫరా చేసే సమయంలో కూలి ఉంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే దెబ్బతిన్న గ్రామాలకు తక్షణమే ప్రత్యామ్నాయ నీటి సౌకర్యం కల్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.


















