Right to Repair: మీ మొబైల్ మీరే రిపేర్ చేసుకోవచ్చు , రైట్ టు రిపేర్ అమలుకు కేంద్రం రెడీ!
Right to Repair: రైట్ టు రిపేర్‌ను భారత్‌లోనూ అమలు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. మరమ్మతు హక్కుని వినియోగదారులకు కల్పించటమే దీని ముఖ్య ఉద్దేశం.
Right to Repair in India:
రైట్ టు రిపేర్ ఫ్రేమ్‌వర్క్ సిద్ధమవుతోంది..
ఓ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌ని ఎంతో ఇష్టపడి కొనుక్కుంటాం. పని చేసినన్ని రోజులు బాగానే పని చేస్తుంది. తరవాత ఉన్నట్టుండి పాడైపోతుంది. వారెంటీలో ఉన్నా సవా లక్ష కారణాలు చెప్పి మన దగ్గర నుంచి డబ్బులు గుంజుతాయి సంస్థలు. వాటి రిపేర్లకు పెట్టే డబ్బుతో మరో కొత్త గ్యాడ్జెట్‌ని కొనుక్కోవచ్చు అని అలాగే వదిలేస్తాం. కానీ మరమ్మతు కూడా ఓ హక్కు అన్న సంగతి మరిచిపోతాం. నిజమే. ఓ కంపెనీ ప్రొడక్ట్ కొనుగోలు చేసినప్పుడు, కేవలం ఆ కంపెనీ మాత్రమే రిపేర్ చేయాలని కాకుండా థర్డ్‌పార్టీలు కూడా మరమ్మతు చేయొచ్చు. లేదా వినియోగ దారులే సొంతగా రిపేర్ చేసుకోవచ్చు. దీన్నే రైట్ టు రిపేర్ (Right to Repair)అంటారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ హక్కుపై వినియోగ దారులు నినదిస్తున్నారు. ఇప్పుడు భారత్‌లోనూ రైట్ టు రిపేర్ అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ని తయారు చేస్తోంది.
రైట్ టు రిపేర్ అంటే..?
ఏదైనా ఓ సంస్థ...తమ ప్రొడక్ట్‌ను వినియోగదారులకు విక్రయించే సమయంలో ఆ ప్రొడక్ట్‌కు సంబంధించిన వివరాలన్నీ తెలియజేయాలి. అందులో ఎలాంటి పరికరాలు వాడతారు, ఎలా రిపేర్ చేసుకోవాలి లాంటి వివరాలు అందించాలి. ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు ఒరిజినల్ మ్యానుఫాక్చర్స్‌పైనే పూర్తిగా ఆధారపడకుండా సొంతగా తయారు చేసుకోవటమో, లేదంటే థర్డ్ పార్టీల సాయంతో మరమ్మతు చేయించటమో లాంటివి చేయొచ్చు. స్పేర్ పార్ట్స్ విషయంలో కొన్ని కంపెనీల గుత్తాధిపత్యాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం నిపుణులు, తయారీదారులతో కూడిన ఓ ప్యానెల్‌ని నియమించనుంది. ఒక్కసారి ఇది అమల్లోకి వస్తే, సంస్థలన్నీ తప్పకుండా తమ ఉత్పత్తుల వివరాలు తెలియజేయాలి. స్పేర్ పార్ట్స్ లేవని, దొరకవని కారణాలు చెప్పి కొత్త ప్రొడక్ట్స్ కొనేలా చేయటం ఇక కుదరదు. కొన్ని సంస్థలు కావాలనే విడి భాగాల కొరత సృష్టించి, కొత్త ఉత్పత్తులు కొనేలా చేస్తుండటంపైనా కేంద్రం నిఘా పెట్టనుంది.
ఎలక్ట్రానిక్ వేస్ట్ తగ్గించవచ్చు..
ప్రపంచవ్యాప్తంగా ఈయూ, యూకే, యూఎస్ దేశాల్లో రైట్ టు రిపేర్ అమలు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అక్కడ పూర్తి స్థాయిలో కాకపోయినా...కొంత మేర అమలవుతోంది. అక్కడి పరిస్థితులను సమీక్షించి భారత్‌లోనూ అమలు చేయాలని భావిస్తోంది కేంద్రం. ఈ రైట్ టు రిపేర్‌తో అనవసరంగా కొత్త ప్రొడక్ట్‌లను కొనుగోలు చేసే బాధ తప్పుతుంది. ఎలక్ట్రానిక్ వేస్ట్‌ను కూడా తగ్గించేందుకు వీలవుతుంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వేస్ట్ పెరుగుతోంది. కంపెనీలు మరమ్మతులో ఎలాంటి ఇబ్బందులు పెట్టకపోతే ఆ మేరకు ఈ-వేస్ట్‌ని తగ్గించుకోవచ్చు.
Also Read: Upasana Kamineni Konidela: 'ఓ మై గాడ్' అది నిజం కాదు - క్లారిటీ ఇచ్చిన ఉపాసన!