మీరు పంపేయాలనుకుంటే వెళ్లిపోతా, అదంతా మీడియా సృష్టి - కమల్ నాథ్ కీలక వ్యాఖ్యలు
Kamal Nath: బీజేపీలో చేరతారన్న పుకార్లపై మరోసారి కమల్ నాథ్ క్లారిటీ ఇచ్చారు.
Kamal Nath on Switching BJP: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ కోరుకుంటే తాను పార్టీ నుంచి వెళ్లిపోడానికి సిద్ధంగానే ఉన్నానని అన్నారు. తనకు వీడ్కోలు ఇచ్చేందుకు చాలా మంది చూస్తున్నారని, అదే నిజమైతే వెళ్లిపోతానని స్పష్టం చేశారు. చింద్వారాలో జరిగిన ఓ మీటింగ్‌కి హాజరైన కమల్ నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నో సంవత్సరాలుగా మధ్య ప్రదేశ్ ప్రజలు తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నారని వెల్లడించారు. కమల్ నాథ్ బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
"కమల్‌నాథ్‌ని మీరంతా కలిసి పంపేయాలనుకుంటే అది మీ ఇష్టం. మీరంతా అనుకుంటే కచ్చితంగా వెళ్లిపోతాను. నేనేమీ కావాలని ఉండడం లేదు. చాలా రోజులుగా మధ్యప్రదేశ్ ప్రజలు నాకు మద్దతునిస్తున్నారు"
- కమల్ నాథ్, కాంగ్రెస్ సీనియర్ నేత
ఓ ర్యాలీలో పాల్గొన్న కమల్‌నాథ్ మరో కీలక ప్రకటన చేశారు. మరోసారి తన కొడుకు నకుల్ నాథ్ చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఇక్కడి నుంచే ఎంపీగా ఉన్నారు. బీజేపీ తనను కాపాడుకోడానికి ఎంతకైనా తెగిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. బీజేపీలో చేరతారన్న రూమర్స్‌పైనా స్పందించారు. అదంతా మీడియా సృష్టి అని కొట్టి పారేశారు.
"అనవసరంగా మీడియా ఏవేవో పుకార్లు పుట్టిస్తోంది. అసలు ఎవరూ అధికారికంగా చెప్పని విషయాన్ని ఎందుకిలా సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదు. బీజేపీలో చేరుతున్నానని నేనెప్పుడైనా చెప్పానా..? మీకు వార్తలు కావాలంటే నాకు చెప్పండి. ఇలాంటి వార్తల్ని ప్రసారం చేయడం ఆపేయండి"
- కమల్ నాథ్, కాంగ్రెస్ సీనియర్ నేత
రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కమల్‌నాథ్ టికెట్ అడిగారని, అందుకు హైకమాండ్ అంగీకరించలేదని సమాచారం. అందుకే...ఆయన అధిష్ఠానంపై అలకతో పార్టీని వీడిపోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ హైకమాండ్ కమల్‌నాథ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించడం లేదని, ఇది కూడా ఆయనను మరింత ఇబ్బంది పెడుతోందని సమాచారం అందింది. రాజ్యసభ టికెట్ విషయంలో విభేదాలు వచ్చిన తరవాతే ఆయన పార్టీ మారే ఆలోచన చేసినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అయితే...కమల్‌నాథ్‌తో పాటు ఆయన కొడుకు నకుల్ నాథ్ కూడా కాంగ్రెస్‌ని వీడే యోచనలో ఉన్నట్టు పుకార్లు వచ్చాయి. తండ్రికొడుకులు ఇద్దరూ ఒకేసారి పార్టీకి షాక్ ఇస్తారా అన్న చర్చ ఇప్పటికే మొదలైంది. దీనికి తోడు కమల్‌నాథ్ ఢిల్లీకి వెళ్లడం మరింత ఆసక్తిని పెంచింది. ఆ తరవాత మీడియా ఆయనను దీనిపై క్లారిటీ అడిగింది. అందుకు ఆయన "అంత తొందరెందుకు..అలాంటిది ఏమైనా ఉంటే ముందు మీకే చెబుతాను" అని సమాధానం దాట వేశారు. ఇప్పుడు మరోసారి క్లారిటీ ఇచ్చారు.
Also Read: రోడ్డు ప్రమాదంలో ఇంటెల్ ఇండియా మాజీ చీఫ్ మృతి, సైక్లింగ్ చేస్తుండగా ఢీకొట్టిన కార్