Supreme Court: కోర్టు ద్వారా బిడ్డను చంపాలనుకుంటున్నారా? : అబార్షన్ కేసులో సుప్రీం వ్యాఖ్య
Supreme Court: కోర్టు ద్వారా బిడ్డను చంపాలనుకుంటున్నారా? : అబార్షన్ కేసులో సుప్రీం వ్యాఖ్య
తన 26 వారాల గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకునే అవకాశం వైద్య పరంగా ఇవ్వాలని కోరుతూ ఓ మహిళ చేసిన అభ్యర్థనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సమయంలోనే న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వు ద్వారా బిడ్డను చంపడానికి అనుమతి కోరుతున్నారా అంటూ ప్రశ్నించింది. శుక్రవారం తదుపరి విచారణకు హాజరయ్యే ముందు పిటిషనర్‌తో మాట్లాడాలని మహిళా కౌన్సిల్‌ను, కేంద్రం తరఫు న్యాయవాదిని ధర్మాసనం కోరింది. మరికొన్ని వారాలు బిడ్డను మోసే బాధ్యత గురించి ఆ మహిళతో మాట్లాడాలని సూచించింది. బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్న పిండాన్ని చంపాలని తాము చెప్పలేమని సీజేఐ పేర్కొన్నారు.
తన 26 వారాల గర్భం విచ్ఛిత్తికి అనుమతించాలని కోరుతూ ఓ 27 ఏళ్ల వివాహిత మహిళ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ముందు ఇద్దరు పిల్లలు ఉన్నారని, మూడో బిడ్డను కని పెంచే ఆర్థిక పరిస్థితుల్లో లేనని ఆమె కోర్టును కోరారు. అలాగే మానసికంగా, ఆరోగ్య పరంగా కూడా తాను బిడ్డను పెంచే స్థితిలో లేనని, డిప్రెషన్‌తో బాధపడుతున్నానని కాబట్టి అబార్షన్‌కు అవకాశం ఇవ్వమని అభ్యర్థించారు. తొలుత ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం ఆమెకు గర్భవిచ్ఛిత్తి చేసుకునేందుకు అక్టోబరు 9న అనుమతి ఇచ్చింది. కానీ ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. అయితే దిల్లీలోని ఎయిమ్స్‌లోని వైద్యుల బృందం ఆమె గర్భస్థ శిశువు బతికే అవకాశం ఉందని చెప్తూ, అబార్షన్‌కు వ్యతిరేకంగా ఎయిమ్స్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను ఉటంకిస్తూ కేంద్రం వాదనలు చేసింది. ఇంతకుముందు జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసంన ఈ కేసులో భిన్నమైన తీర్పు ఇవ్వడంతో ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ విచారణకు తీసుకుంది.
విచారణ సమయంలో ప్రధాన న్యాయమూర్తి పలు ప్రశ్నలు అడిగారు. ఈమె ఇంతకుముందు ఎందుకు అబార్షన్‌కు అనుమతి తీసుకోలేదని, 26 వారాలుగా ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఆమెకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుసు కదా ఇప్పుడు ఎందుకు వచ్చారు? అంటూ న్యాయమూర్తి ప్రశ్నలు వేశారు. న్యాయపరమైన తీర్పు ద్వారా బిడ్డ మరణానికి ఉత్తర్వు జారీ చేయాలా? అంటూ అసహనం వ్యక్తంచేశారు. కేంద్ర తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వైద్యుల నివేదికను ఉటంకిస్తూ మాట్లాడారు. 'బిడ్డ జన్మించడానికి సిద్ధంగా ఉంది, జీవం సంకేతం స్పష్టంగా ఉంది. కాబట్టి అబార్షన్ చేయడం సరికాదు. పిటిషనర్ తరఫు కౌన్సిల్ అత్యాచార బాధితురాలి అబార్షన్ పిటిషన్‌ను ఉదహరిస్తున్నారు. ఈమె అత్యాచార బాధితురాలు కాదు. మైనర్ కాదు. 26 వారాలుగా ఏం చేస్తోంది?' అని ఐశ్వర్య భాటి అన్నారు.
ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఈ విషయంలో పుట్టబోయే బిడ్డ హక్కులను కూడా పరిశీలించాలని అన్నారు. బిడ్డ పుట్టడానికి అనుమతించేందుకు కోర్టుకు ఆప్షన్ ఉందని, ప్రభుత్వం ఆ బిడ్డ సంరక్షణ చూసుకుంటుందని తెలిపారు. బిడ్డను మరికొన్ని వారాలు మోయాలని మహిళకు సూచించారు. ఇంకొన్ని వారాల తర్వాత ప్రసవానికి వెళ్లాలని, తొందరగా ప్రసవం చేస్తే బిడ్డ వైకల్యాలతో పుట్టే అవకాశం ఉందని, అలా అయితే బిడ్డను దత్తత తీసుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.