Punjab DGP : డ్రగ్స్ స్మగ్లర్ల నుంచి ఆదేశాలు అందుకుని పోలీసులకు పోస్టింగ్‌లు.. పంజాబ్ మాజీ డీజీపీపై తీవ్రమైన ఆరోపణలు !
పంజాబ్ మాజీ డీజీపీ చటోపాధ్యాయ డ్రగ్స్ స్మగ్లర్ల ఆదేశాల మేరకు పోలీసులకు పోస్టింగ్‌లు ఇచ్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆయన ప్రధాని భద్రతా వైఫల్యం ఘటనలో విచారణ ఎదుర్కొంటున్నారు.
ప్రధాని మోదీకి రక్షణ కల్పించడంలో విఫలమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్ మాజీ డీజీపీ సిద్ధార్థ్ చటోపాధ్యాయపై మరో తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఓ డ్రగ్స్ కేసులో నిందితుల నుంచి ఆయన ఆదేశాలు తీసుకుని దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారని శిరోమణి అకాలీదళ్ తాజాగా ఆరోపించింది. ఆ పార్టీ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఈ మేరకు కొన్ని ఆడియో టేపులు విడుదల చేశారు. డీజీపీగా ఉన్న సమయంలో సిద్ధార్థ్ చటోపాధ్యాయ భోలా డ్రగ్స్ కేసు నిందితుల నుంచి ఆదేశాలు అందుకుని కొన్ని పోలీస్ స్టేషన్లలో ఆఫీసర్లను బదిలీ చేశారని.. మరికొంత మందిని అక్కడే కొనసాగించాలని బాదల్ ఆరోపించారు.
Also Read: సివిల్ సర్వీస్ కేడర్ రూల్స్‌లో మార్పులకు కేంద్రం సిద్దం - వ్యతిరేకిస్తూ కేసీఆర్ లేఖ !
సిద్ధార్థ్ చటోపాధ్యాయపై అకాలీదళ్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. నిన్నామొన్నటి వరకూ డీజీపీగా ఉన్న సిద్ధార్థ్.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించడానికి కొన్ని గంటల ముందే బదిలీ అయ్యారు. ఆయన పనితీరుపై పంజాబ్‌లో తీవ్రమైన విమర్శలు ఉన్నా.. జనవరి 5 ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనకు సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు... పోలీసుల భద్రతా వైఫల్యం తర్వాత ఆయనపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి.
ఫిరోజ్‌పూర్‌లో భద్రతా లోపాల కారణంగా ప్రధాని కాన్వాయ్ దాదాపు 20 నిమిషాల పాటు ఓ ఫ్లైఓవర్ పై నిలిచిపోయింది. ప్రధాని మోదీ ఫ్లైఓవర్ పైనే చిక్కుకుపోవడం కలకలం రేపింది. ఈ ఘటనతో ప్రధాని మోదీ తన పర్యటను రద్దు చేసుకుని తిరిగి వెళ్లిపోయారు. ప్రధాని కాన్వాయ్ ని అడ్డుకున్న ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. భద్రతా వైఫల్యానికి సంబంధించి పంజాబ్ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజాబ్ డీజీపీ.. భద్రతా ఉల్లంఘనలకు పాల్పడ్డారని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కుట్ర పూరితంగానే ప్రధాని పర్యటనను అడ్డుకున్నారని బీజేపీ ఆరోపించింది.