Punjab Congress Clash: అసలైన కోల్డ్ వార్ అమరీందర్ X సిద్ధూ మధ్య కాదా?
పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కు రాహుల్, ప్రియాంక గాంధీకి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా? అమరీందర్ సింగ్ చెబుతున్నా వినకుండా పార్టీ అధిష్ఠానం సిద్ధూకు పీసీసీ చీఫ్ ఎందుకు ఇచ్చింది? అసలేమైంది
పంజాబ్ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలకు ఈ మధ్యే కాంగ్రెస్ అధిష్ఠానం చెక్ పెట్టింది. అయితే అసలు అంతర్గత విభేదాలు ఎవరెవరికి మధ్య? సీఎం అమరీందర్ సింగ్ X సిద్ధూగా కనిపించిన ఈ మొత్తం వ్యవహారంలో వేరే నిజం దాగుందట. అసలైన కోల్డ్ వార్ జరిగింది అమరీందర్ సింగ్ X రాహుల్, ప్రియాంక మధ్య అని పంజాబ్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అసలేం జరిగింది?
రాహుల్, ప్రియాంక చేతిలో..
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. ఏదైనా కీలక విషయాల తప్ప మిగిలినవి అన్నీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చూసుకుంటున్నారు. ఈ మధ్య చెలరేగిన పంజాబ్ అంతర్గత విభేదాలపై కూడా వారిద్దరదే నిర్ణయమని సమాచారం.
నవజోత్ సింగ్ సిద్ధూ కేవలం పాత్రధారి మాత్రమే. అసలైన కోల్డ్ వార్ అమరీందర్ VS రాహుల్, ప్రియాంక గాంధీ మధ్యే నడించింది. నెహ్రూ- గాంధీ వారసులు పార్టీలు తమకంటే ఎవరైనా గొప్ప నేతలు ఉంటే సహించలేరు. అందుకే అమరీందర్ ను తక్కువ చేయాలనే వాళ్లు సిద్ధూకు ఆ పదవి ఇచ్చారు.
- కాంగ్రెస్ విశ్వసనీయ సమాచారం
వారిలానే అమరీందర్..
కాంగ్రెస్ నుంచి భాజపాలోకి వెళ్లిన జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాదా ఆ పార్టీకి విధేయులు, పైగా యువనేతలు. అయితే వారి డిమాండ్లను చాలాసార్లు పార్టీ అధిష్ఠానం పక్కన పెట్టడం వల్ల వేరేదారి చూసుకున్నారు. ఇదే కోవలో రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కూడా పార్టీపై రెబల్ జెండా ఎగురవేసిన తరువాత అలక మానారు. ప్రస్తుతం పంజాబ్ సీఎం అమరీందర్ కూడా తన డిమాండ్లను పక్కన పెట్టడంతో పార్టీ అధిష్ఠానంపై నిరాశగా ఉన్నట్లు సమాచారం.
పట్టించుకోని రాహుల్..!
అయితే యువనేతల మాదిరిగా సీనియర్ నేత అయిన అమరీందర్ కూడా ఇలాంటి విషయాలపై పట్టుబట్టడాన్ని రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రాహుల్, ప్రియాంక.. సిద్ధూ పార్టీకి కొత్త అయినప్పటికీ పీసీసీ చీఫ్ పదవిని ఇచ్చారని తెలుస్తోంది. 13 ఏళ్లు భాజపాలో ఉన్న సిద్ధూ 2017లోనే కాంగ్రెస్ లో చేరారు.
అమరీందర్ ను కాదని..
అమరీందర్ తో పోలిస్తే సిద్ధూకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు రాహుల్, ప్రియాంక గాంధీ. ఎందుకంటే అమరీందర్ పాలనపై సిద్ధూ ఆరోపణలు చేసిన అనంతరం సీఎంను దిల్లీ పిలిచి సమీక్ష సమావేశాలు నిర్వహించింది కాంగ్రెస్ అధిష్ఠానం. అంతేకాకుండా అమరీందర్ వ్యతిరేకించినా పీసీసీ పదవి సిద్ధూకే ఇచ్చారు. పార్టీ అధిష్ఠానం పంజాబ్ ప్రభుత్వ పాలన, రాజకీయాల్లో బలవంతంగా వేలు పెడుతుందని అమరీందర్.. సోనియా గాంధీకి రాసిన లేఖలో ఆరోపించారు.
సిద్ధూ బలప్రదర్శన..
జులై 18న సిద్ధూను పంజాబ్ పీసీసీ చీఫ్ గా ప్రకటించిన తర్వాత జులై 21న 77 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 39 మంది ఆయన నివాసానికి వెళ్లి సిద్ధూను కలిశారు. వీరందరూ కలిసి స్వర్ణ దేవాలయానికి వెళ్లారు. తద్వారా సిద్ధూ తన వెనుక ఉన్న బలాన్ని చూపిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.
అయితే సిద్ధూ, అమరీందర్ కు మధ్య నడుస్తున్నట్లు కనిపిస్తున్న ఈ అంతర్గత యుద్ధం వెనుక రాహుల్, ప్రియాంక గాంధీ ఉన్నట్లు కనపిస్తోందన్నది విశ్లేషకుల మాట. అయితే పంజాబ్ కాంగ్రెస్ మధ్య లుకలుకలు సమసిపోయాయని రాహుల్ గాంధీ ఇటీవల అన్నారు. అయితే ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదని పంజాబ్ కాంగ్రెస్ నేతలు బహిర్గతంగానే చెబుతున్నారు. మరి ఈసారి ఎవరిది పైచేయి అవుతుందో?