Presidential Election 2022: మోదీకి పవర్ పంచ్,దీదీ ప్లానింగ్ మామూలుగా లేదుగా
ప్రతిపక్ష నేతలందరూ ఏకం కావాలంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. దిల్లీ వేదికగా జరిగే సమావేశానికి హాజరు కావాలంటూ ఆహ్వానం పలికారు.
ప్రతిపక్ష నేతలకు లేఖ రాసిన మమతా బెనర్జీ
ప్రతిపక్ష నేతల్ని ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఎప్పటి నుంచో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. భాజపాకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్నది ఆమె ఆకాంక్ష. అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల వేళ ఈ వ్యూహాలకు ఇంకా పదును పెడుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల విషయమై చర్చించేందుకు రావాలంటూ 20 మంది ప్రతిపక్ష నేతలకు ఆమె లేఖ రాశారు. ఈ నెల 15వతేదీన దిల్లీ వేదికగా చర్చించేందుకు ఆహ్వానం పంపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, సీపీఐ(ఎమ్) జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి, సీపీఐ జనరల్ సెక్రటరీ డి. రాజాకు లేఖలు పంపారు. వీరితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ మమత ఆహ్వనం పలికారు. వీరిలో ఉద్ధవ్ థాక్రే, అరవింద్ కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్, కేసీఆర్, ఎమ్‌కే స్టాలిన్, హేమంత్ సోరెన్, పినరయి విజయన్ ఉన్నారు.
Our hon'ble chairperson @MamataOfficial calls upon all progressive opposition forces to meet and deliberate on the future course of action keeping the Presidential elections in sight; at the Constitution Club, New Delhi on the 15th of June 2022 at 3 PM. pic.twitter.com/nrupJSSbT8
— All India Trinamool Congress (@AITCofficial) June 11, 2022
కాంగ్రెస్ జోక్యంపై ఆ పార్టీల అసహనం
లాలూ ప్రసాద్ యాదవ్, మెహబూబా ముఫ్తీ, ఫరూఖ్ అబ్దుల్లా లాంటి సీనియర్ నేతలకూ మమత లేఖ అందింది. జూన్ 15న మధ్యాహ్నం దిల్లీ కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశం కానున్నారు. భాజపా హయాంలో ప్రాధాన్యత దక్కని వర్గాల గొంతుని వినిపించటమే చర్చల ప్రధాన ఎజెండా అని ఈ లేఖలో మమతా బెనర్జీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి కష్టకాలం వచ్చిందని, సమస్యలు తీర్చాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల విషయమై చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది. ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిని ప్రకటించేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ విషయమై చాన్నాళ్లుగా ఇతర పార్టీలతో చర్చలు జరుపుతోంది. అయితే కాంగ్రెస్ కన్నా ముందుగానే
ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే విషయంలో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు పశ్చిమ బంగ సీఎం మమత బెనర్జీ. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జూన్ 9వ తేదీనే మమతా బెనర్జీ సహా స్టాలిన్, శరద్ పవార్, సీతారం ఏచూరితో సంప్రదింపులు జరిపారు. అన్ని పార్టీల నేతలతో మాట్లాడే బాధ్యతను మల్లికార్జున్ ఖార్గేకు అప్పగించారు. ఇందుకు అనుగుణంగానే ఖార్గే, మమతా బెనర్జీతో చర్చించారు. ఇంత వరకు బాగానే ఉన్నా టీఆర్‌ఎస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్ పార్టీలు కాంగ్రెస్ వైఖరిపై కాస్త అసంతృప్తిగా ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో కాంగ్రెస్ జోక్యాన్ని ఆయా పార్టీలు అంగీకరించటంలేదు. ఫలితంగా చర్చలు ఫలవంతంగా సాగుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ చిన్న చిన్న మనస్పర్ధల్ని, భేదాభిప్రాయాల్ని పక్కన పెట్టి భాజపాకు వ్యతిరేకంగా పోరాడాలాని మమతా బెనర్జీ లేఖలో ప్రస్తావించారు. ప్రతిపక్షాలన్నీ ఏకం కావటానికి ఇదే సరైన సమయం అని గుర్తు చేశారు.