India Pakistan News: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్రేజీ కోరిక- నరేంద్ర మోదీతో టీవీ డిబేట్ కావాలట!
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో టీవీ డిబేట్‌లో పాల్గొనాలని ఉందన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెలివిజన్ డిబేట్‌లో చర్చించాలనుకుంటున్నట్లు పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను తొలగించుకునేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. రష్యా టుడే ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
వ్యాపారం దెబ్బతింది
భారత్.. శత్రు దేశంంగా మారడం వల్ల వ్యాపారం చేయలేకపోతున్నామని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. సమస్యలపై చర్చించుకోవడం ద్వారా వ్యాపార లావాదేవీలు పెరిగి రెండు దేశాలు లాభపడతాయని అభిప్రాయపడ్డారు.
ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు. అయితే ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి పనిచేయవని ఎప్పటి నుంచో భారత్ స్పష్టం చేస్తోంది. పాకిస్థాన్ సర్కార్ ముందు ఉగ్రవాదాన్ని అంతం చేయాలని భారత్ డిమాండ్ చేస్తోంది.
అంతేకాదు 2008 నుంచి 2019 వరకూ పాక్ జరిపిన ఉగ్రదాడుల్లో ఎంతోమంది భారత సైనికులు బలి అయ్యారు. ఆ దాడులను జరిపిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలను అణిచివేయాలన్నది భారత్ ప్రధాన డిమాండ్.
స్వతంత్య్రం వచ్చిన తర్వాత 75 ఏళ్లలో భారత్- పాక్ మధ్య 3 యుద్ధాలు జరిగాయి. మోదీ సర్కార్.. కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌తో వాణిజ్య బంధాలను వద్దనుకుంది.
రష్యా పర్యటనలో
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యనటకు వెళ్లే ముందు ఈ ఇంటర్వ్యూ జరిగింది. ఇమ్రాన్ ఖాన్ మాస్కో వెళ్లి.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ కానున్నారు. గత 20 దశాబ్దాల్లో పాకిస్థాన్ ప్రధాని రష్యా వెళ్లడటం ఇదే తొలిసారి.
ఈ సందర్భంగా ఉక్రెయిన్ సంక్షోభంపై ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ సంక్షోభంతో మాపై ఎలాంటి ప్రభావం లేదని, రష్యాతో బలమైన ద్వైపాక్షిక బంధమే ముఖ్యమని ఇమ్రాన్ అన్నారు.