Pakistan Army: ఇమ్రాన్ ఖాన్‌పై పాకిస్థాన్ ఆర్మీ సీరియస్, కఠిన చర్యలు తప్పవా?
Pakistan Army - Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌పై పాకిస్థాన్ ఆర్మీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Pakistan Army - Imran Khan:
ఇమ్రాన్ ఆరోపణలపై మండిపాటు..
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై దాడి జరగటం వెనక ఆర్మీ కుట్ర ఉందని Pakistan Tehreek-e-Insaf (PTI) ఆరోపిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ కూడా ఇదే ఆరోపణలు చేశారు. ఓ సీనియర్ ఆర్మీ అధికారి ఈ కుట్ర వెనక ఉన్నారని అన్నారు. ఈ ఆరోపణలపై పాకిస్థాన్ ఆర్మీ తీవ్రంగా స్పందించింది. అసత్య ఆరోపణలు చేసినందుకు ఇమ్రాన్‌పై లీగల్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతోంది. Director General Inter-Services Public Relations (DGISPR)అధికారులు...ఇమ్రాన్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. " ఓ ఉన్నతాధికారిపై నిరాధార,
బాధ్యతా రాహిత్య ఆరోపణలు చేసిన కారణంగా చర్యలు తీసుకోవాల్సిందే" అని వెల్లడించారు. "కేవలం ప్రధాని కుర్చీలో కూర్చోవాలనే ఆశతో, ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే దురుద్దేశంతో సీనియర్ అధికారులపై నిరాధార ఆరోపణలు చేస్తే తప్పకుండా ఆర్మీ అధికారులకే మేము అండగా నిలుస్తాం. ఇమ్రాన్ చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం" అని స్పష్టం చేశారు.
నెక్స్ట్ ఏంటి..?
ప్రభుత్వానికి వ్యతిరేకంగా Hakiqi Azadi Marchను అక్టోబర్ 28న ప్రారంభించారు.. ఇమ్రాన్ ఖాన్. ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొట్టి ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌ను వినిపించారు. నిజానికి...ఈ మార్చ్‌పై దాడి జరిగే ప్రమాదం ఉందని ముందుగానే హెచ్చరికలు వచ్చాయి. నిఘా వర్గాలు కూడా అప్రమత్తంగానే ఉన్నాయి. అయినా...దాడి జరిగింది. మరోసారి ప్రధాని కుర్చీలో కూర్చోవాలని ఉవ్విళ్లూరుతున్న ఇమ్రాన్‌పై అటాక్ జరగటం అక్కడ సంచలనమైంది. పంజాబ్ ప్రావిన్స్‌లోని గుజ్రన్‌వాలాలో వందలాది మంది మద్దతుదారుల మధ్య ఇమ్రాన్ ఖాన్ ప్రసంగిస్తుండగా దాడి జరిగింది. కొన్ని బుల్లెట్‌లు ఇమ్రాన్ ఖాన్ కాల్లోకి దూసుకుపోయాయి. ఇమ్రాన్ పక్కనే ఉన్న నేతలకూ గాయాలయ్యాయి.
దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులు...విచారణ జరిపారు. ఈ విచారణలో...తాను ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేసేందుకే వచ్చానని అంగీకరించాడు నిందితుడు. దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని అందుకే చంపాలనుకున్నానని వివరించాడు. ఇది జరిగిన మరుక్షణం నుంచే ఇమ్రాన్ వర్గానికి చెందిన నేతలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. చూస్తుంటే...పాక్‌లో మరోసారి పరిస్థితులు ఆందోళనకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రచ్ఛన్న యుద్ధానికీ దారి తీయొచ్చని కొందరు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు ఈ ఒత్తిడిని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఎలా తట్టుకుంటుంది..? ఇమ్రాన్ వర్గీయులు ఒక్కసారిగా అల్లర్లు సృష్టిస్తే వాటిని ఎలా అదుపు చేస్తుంది..? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగో లేదు. ఇలాంటి కష్టకాలంలో ఇమ్రాన్‌ఖాన్‌పై దాడి జరగటం అక్కడి వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. ఈ మధ్యే FATF గ్రే లిస్ట్ నుంచి బయటపడ్డ ఆ దేశానికి...ప్రస్తుత పరిణామాలు పెద్ద దెబ్బే అవుతుండొచ్చు. పదేపదే సైన్యాన్ని తప్పు పడుతున్న ఇమ్రాన్ ఖాన్‌ను అణిచివేసేందుకు...షహబాజ్ ప్రభుత్వం ఆ సైన్యాన్నే అడ్డు పెట్టుకునే అవకాశం లేకపోలేదు.
Also Read: Bharat Jodo Yatra: అరెరే కేజీఎఫ్ పాట ఎంత పని చేసింది, రాహుల్‌పై కాపీరైట్ యాక్ట్ కేసు నమోదు