Odisha Crime News: ఒడిశాలో మరో రష్యన్ పౌరుడు మృతి- అసలేం జరుగుతుంది?
Odisha Crime News: ఒడిశాలో రష్యన్ పౌరుల మిస్టరీ మరణాలు కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న హోటల్ లో ఇద్దరు చనిపోగా తాజాగా మరో రష్యన్ పౌరుడి మృతదేహం లభ్యం అయింది.
Odisha Crime News: ఒడిశాలో రష్యన్ పౌరుల మిస్టరీ మరణాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవలే ఒక హోటల్ లో ఇద్దరు రష్యన్లు మృతి చెందిన డెత్ మిస్టరీ వీడకముందే మరో రష్యన్ పౌరుడు చనిపోయాడు. రెండు వారాల వ్యవధిలోనే ముగ్గురు రష్యన్లు మరణించడంతో ఇంతకీ ఒడిశాలో ఏం జరుగుతుందనే ఆందోళన అందరిలోనూ నెలకొంది. జగత్ సింఘ్ పూర్ జిల్లాలోని పారాదిప్ పోర్టులోని ఓ షిప్ లో మంగళవారం రోజు రష్యా పౌరుడి మృతదేహం లభ్యమైంది. ఎంబీ అల్ద్నాహ్ షిప్ లో చీఫ్ ఇంజినీర్ గా పని చేస్తున్న 51 ఏళ్ల మిలియాకోవ్ సెర్గేగా పోలీసులు గుర్తించారు. ఆ నౌక బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ పోర్టు నుంచి పారాదీప్ పోర్టు మీదుగా ముంబైకి వస్తోంది. నౌకలోని తన ఛాంబర్ లో మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో మరణించినట్లు సమాచారం. అయితే అతడి మృతికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
గతంలో దక్షిణ ఒడిశాలోని రాయగడ నగరంలో ఓ హోటల్ లో ఇద్దరు టూరిస్టులు రెండు రోజుల వ్యవధిలో మరణించారు. అందులో ఒకరు రష్యా చట్టసభ సభ్యుడు కూడా ఉన్నారు. వారు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం, అధ్యక్షుడు వ్లాదిముర్ పుతిన్ కు వ్యతిరేకంగా గతంలో మాట్లాడడం పలు అనుమానాలకు తావిస్తోంది. రష్యా చట్టసభ సభ్యుడు పావెల్ ఆంటోవ్(65) డిసెంబర్ 24వ తేదీన హోటల్ మూడో అంతస్తు నుంచి పడిపోయి చనిపోయారు. అంతకు ముందు డిసెంబర్ 22వ తేదీన ఆయన స్నేహితుడు వ్లాదిమిర్ బిదెనోవ్(61) హోటల్ గదిలో మృతి చెందారు. ఈ రెండు కేసులపై ఒడిశా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.