Adani Statement: టన్నెల్ ప్రమాద ఘటనలో అదానీ గ్రూప్‌పై దుష్ప్రచారం - ఎలాంటి సంబంధం లేదన్న కంపెనీ !
Adani Statement: ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదంలో తమ పాత్ర లేదని అదానీ గ్రూప్ ప్రకటించింది. కాంట్రాక్ట్ సంస్థలతో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.
Adani Statement: ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని ఉత్తర్‌కాశిలో నిర్మాణంలో ఉన్న సొరంగం (Tunnel)లో కొంతభాగం కుప్పకూలి 41 మంది కార్మికులు గత 16 రోజులుగా చిక్కుకుపోయిన ఘటనలో తమ గ్రూప్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అదానీ గ్రూప్ ఖండించింది. ఉత్తరాఖండ్ సొరంగం నిర్మాణంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేసింది. ఈ ఘటనను తమ గ్రూప్‌తో ముడిపెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపింది. ఉత్తరాఖండ్ సొరంగం నిర్మాణంలో అదానీ గ్రూప్, దాని అనుబంధ సంస్థలకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎలాంటి ప్రమేయం లేదని వివరించింది.
'ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న సొరంగం కుప్పకూలడం దురదృష్టకరం. ఈ ఘటనకు మా సంస్థతో ముడిపెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఈ టన్నెల్‌ను నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ నిర్మించింది. ఆ సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదు. అందులో మాకు షేర్లు కూడా లేవు'' అని అదాని గ్రూప్ ప్రకటన విడుదల చేసింది.
Clarification on nefarious attempts to link us to the unfortunate collapse of a tunnel in Uttarakhand. pic.twitter.com/4MoycgDe1U
— Adani Group (@AdaniOnline) November 27, 2023
నవంబర్ 12న నిర్మాణంలో ఉన్న టన్నెల్‌లో కొంత భాగం కుప్పకూలడంతో అందులో 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆర్మీ కూడా రంగంలోకి దిగింది.
హైదరాబాద్‌కు చెందిన నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ సొరంగం నిర్మాణ బాధ్యతలు చేపట్టింది.నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ తో పాటు సబ్ కాంట్రాక్ట్ తీసుకన్న VSL ప్రైవేట్ లిమిటెడ్ సబ్-కాంట్రాక్టర్లపై FIR నమోదు చేశారు. సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే యొక్క ప్యాకేజీ 16ని నిర్మించడానికి సబ్ కాంట్రాక్టులు తీసుకున్నారు. అదానీ గ్రూప్ నకు ఏ విధంగా సంబంధం లేకపోయినా తమ గ్రూప్ కు ముడిపెడుతున్నారని అదాని గ్రూప్ ఆరోపిస్తోంది.