Central Team Visit: నిండా మునిగాం, ప్రభుత్వమే ఆదుకోవాలి- కేంద్ర బృందం ముందు నెల్లూరు రైతుల ఆవేదన
Central Team In Nellore: నెల్లూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటించింది. జిల్లాలో పంట నష్టపోయిన ప్రాంతాలను వారు పరిశీలించారు.
నిండా మునిగాం, ఆదుకోండి.. అంటూ నెల్లూరు జిల్లా రైతాంగం కేంద్ర బృందం ముందు మొరపెట్టుకుంది. మిగ్ జాం తుపాను వల్ల పూర్తిగా నష్టపోయామని, ఆదుకోవాలని అన్నదాతలు అధికారుల్ని కోరారు. నెల్లూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటించింది. జిల్లాలో పంట నష్టపోయిన ప్రాంతాలను వారు పరిశీలించారు. బాధిత రైతులతో ముఖాముఖి మాట్లాడారు. పంట నష్టం వివరాలను నమోదు చేసుకున్నారు. తాము సేకరించిన వివరాలతో నివేదిక తయారు చేసి కేంద్రానికి సమర్పిస్తామని తెలిపారు అధికారులు. కేంద్ర బృందంలో రాజేంద్ర రత్ను, విక్రం సింగ్ మరికొందరు అధికారులున్నారు. వీరి వెంట నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, ఆర్డీవో మలోలా ఉన్నారు. పంట నష్టపోయిన ప్రాంతాలకు అధికారులను వారు తీసుకెళ్లారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ లెక్కలు..
నెల్లూరు జిల్లాలో మిగ్ జాం తుపాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్ర వ్యవసాయశాఖ జిల్లా వ్యాప్తంగా పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు తయారు చేసింది. ఆ అంచనాల ప్రకారం ఖరీఫ్ సీజన్ కు సంబంధించి కోత దశలో ఉన్న వరి 16.20 హెక్టార్లలో దెబ్బతిన్నది. రబీ సీజన్ కి సంబంధించి 728.43 హెక్టార్లలో నారుమడులు దెబ్బతినగా, 2867 హెక్టార్లలో నాట్లు వేసిన పంట పొలాలు మునిగిపోయాయి. 149 హెక్టార్లలో వేరుసెనగ, 12 హెక్టార్లలో జొన్న, 60 హెక్టార్లలో మొక్కజొన్న, 621 హెక్టార్లలో శెనగలు దెబ్బతిన్నాయి. మినుములు 621 హెక్టార్లు, పెసలు, 42 హెక్టార్లు, నువ్వులు 40, పొద్దుతిరుగుడు 48, పొగాకు పంటలు 1753 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు అధికారులు లెక్కగట్టారు. అరటి పంటకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది.
కేంద్ర బృందం పర్యటన..
కేంద్ర హోంశాఖ అధికారి, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి రాజేంద్ర రత్ను అధ్యక్షతన వ్యవసాయ, ఆర్థిక, విద్యుత్తు, రవాణా, గ్రామీణాభివృద్ధి శాఖలకు చెందిన అధికారుల బృందం ఈరోజు నెల్లూరు జిల్లాలో పర్యటించింది. కోవూరు నియోజకవర్గం ఇనమడుగు, లేగుంటపాడు, వేగూరు ప్రాంతాల్లో దెబ్బతిన్న అరటి తోటలను వారు పరిశీలించారు. ఇందుకూరుపేట మండలం పల్లిపాడు, జగదేవిపేట ప్రాంతాల్లో పడిపోయిన విద్యుత్తు స్తంభాలు, ఉప విద్యుత్తు కేంద్రాన్ని సందర్శించారు. కొత్తూరు ప్రాంతంలో దెబ్బతిన్న నివాస గృహాలు, గుడిసెలను కూడా వారు పరిశీలించి బాధితులతో మాట్లాడారు. సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం పంటపాలెంలో దెబ్బతిన్న చేపల గుంటలను వారు పరిశీలించారు. పంటకాల్వలకు జరిగిన నష్టాన్ని కూడా వారు పరిశీలించారు. ఆ తర్వాత కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు.
మిగ్ జాం వల్ల భారీ వర్షాలతోపాటు ఈదురుగాలులు కూడా పంటలకు తీవ్ర నష్టం కలిగించాయి. ముఖ్యంగా మొక్కజొన్న, అరటి పంటలు ఈ గాలులకు దెబ్బతున్నాయి. చెట్లు మొత్తం నేలకొరిగాయి. ఇక వర్షాలకు వరిచేలు నీటమునిగాయి. అయితే సోమశిల ప్రాజెక్ట్ కి నీటి ప్రవాహం ఎక్కువగా రాకపోవడం ఒక్కటే ఇక్కడ సంతోషించదగ్గ విషయం. ఎగువ ప్రాంతాల్లో పెద్దగా వర్షాలు కురవలేదు. దీంతో పెన్నాకు వరదపోటెత్తలేదు. ఇటు వర్షాలకు తోడు అటు పెన్నా కూడా పోటెత్తితే రైతులు తీవ్రంగా ఇబ్బంది పడి ఉండేవారు. ప్రస్తుతానికి భారీ వర్షం, గాలులకు పంట నష్టం మాత్రమే సంభవించింది. ఇప్పుడు వ్యవసాయంపై పెట్టిన పెట్టుబడులతో నష్టపోయామని అంటున్నారు రైతులు. మరోసారి సాగు పెట్టుబడికోసం అప్పులు చేయక తప్పడం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం వ్యవసాయశాఖ 80 శాతం రాయితీపై వరి విత్తనాలు అందిస్తున్నట్లు చెబుతోంది. అయితే క్షేత్ర స్థాయిలో విత్తనాలు దొరకడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర బృందం జిల్లాలో పర్యటించగా ఈనెల 18లోపు వారు నివేదిక అందజేస్తారని. కేంద్రం కూడా సాయం చేస్తే రైతులకు మరింత మేలు జరుగుతుందని చెబుతున్నారు రాష్ట్ర అధికారులు.