PCC chief swearing Ceremony: కెప్టెన్ ముందే సిక్సర్ కొట్టిన సిద్ధూ.. వీడియో వైరల్!
నవజోత్ సింగ్ సిద్ధూ.. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఈ కార్యక్రమంలో సిద్ధూ కొట్టిన సిక్సర్ వైరల్ గా మారింది. సిద్ధూ సిక్సర్ కొట్టడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఇది చదవాల్సిందే
ఇండియన్ టీమ్ మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూకి సిక్సర్లు కొత్త కాదు. క్రికెట్ ఆడే రోజుల్లో ఆయనను సిక్సర్ల సిద్ధూగా పిలిచేవారు. ప్రస్తుతం పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అయిన సందర్భగా సిద్ధూ మరోసారి సిక్సర్ కొట్టారు. నేడు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా సిద్ధూ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా స్టేజ్‌పైనే సిద్ధూ సిక్సర్ కొట్టినట్లు ఓ షాట్ ఆడారు. ఆ సమయంలో సీఎం అమరీందర్ ఆ పక్కనే కూర్చున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా తన పేరును పిలవగానే.. సిద్ధూ నిజంగానే బ్యాటింగ్ చేయడానికి వెళ్తున్నట్లుగా వామప్ చేస్తూ కుర్చీలో నుంచి లేచి ఓ సిక్సర్ షాట్ ఆడుతున్నట్లుగా చేతులు ఊపారు.
#WATCH: Newly appointed Punjab Congress president Navjot Singh Sidhu mimics a batting style as he proceeds to address the gathering at Punjab Congress Bhawan in Chandigarh.
— ANI (@ANI) July 23, 2021
(Source: Punjab Congress Facebook page) pic.twitter.com/ZvfXlOBOqi
సమస్య పరిష్కారమైందా..?
ప్రమాణ స్వీకారానికి ముందు పంజాబ్ భవన్‌లో అమరీందర్‌కు రెండు చేతులు జోడించి సిద్ధూ స్వాగతం పలికారు. సిద్ధూ తనకి చిన్ననాటి నుంచే తెలుసని, ఆయన తండ్రి తనకి సన్నిహితుడని అమరీందర్ సైతం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చెప్పడం విశేషం. అయితే ఇప్పటివరకు నువ్వా-నేనా అనుకున్న కెప్టెన్, సిద్ధూ మధ్య సఖ్యత కుదర్చడంలో కాంగ్రెస్ అధిష్ఠానం సఫలమైందని విశ్లేషకులు అంటున్నారు.
పంజాబ్ సీఎంగా అమరీందర్‌ను దించాల్సిందే అంటూ పోరాడిన సిద్ధూ చివరికి పీసీసీ చీఫ్ పదవిని దక్కించుకున్నారు. ఆయనకు ఈ పదవి ఇవ్వడాన్ని అమరీందర్ తీవ్రంగా వ్యతిరేకించారు. సిద్ధూ సైతం అమరీందర్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఇరుకున పెట్టింది.
సిద్ధూ జోష్..
ప్రమాణస్వీకారం సందర్భంగా సిద్ధూ పంజాబ్‌లో కాంగ్రెస్ కోటను మరింత బలోపేతం చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు. పంజాబ్‌లో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ కుటుంబానికి చెందిన ప్రతిఒక్క సభ్యుడితోనూ కలిసి వినయపూర్వకంగా పనిచేస్తానన్నారు. పంజాబ్ మోడల్, హైకమాండ్ 18 పాయింట్ల అజెండా ద్వారా అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తానన్నారు. నేటి నుంచి తనతో పాటు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను పీసీసీ చీఫ్ గానే పరిగణిస్తానని సిద్ధూ అన్నారు. సిద్ధూతో పాటు మరో నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులను కూడా కాంగ్రెస్ నియమించింది.
రాహుల్ క్లారిటీ..
కెప్టెన్, సిద్ధూ మధ్య సమస్య ప్రస్తుతం సమస్య సద్దుమణిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం ముఖాముఖీగా కలుసుకున్న కొద్ది సేపటికే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.