Chandrayaan-3: ఆస్ట్రేలియా బీచ్‌లో మిస్టరీ వస్తువు- చంద్రయాన్‌తో ఏంటీ సంబంధం- చూడటానికి ఎవరు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక!
పశ్చిమ ఆస్ట్రేలియాలోని గ్రీన్ హెడ్ తీరంలో ఓ మిస్టరీ వస్తువు కలకలం రేపుతోంది. దీని గురించి తెలుసుకునేందుకు విచారణ చేపట్టినట్లు ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ ట్విటర్‌లో తెలిపింది.
పశ్చిమ ఆస్ట్రేలియాలోని గ్రీన్ హెడ్ తీరంలో ఓ మిస్టరీ వస్తువు కలకలం రేపుతోంది. దీని గురించి తెలుసుకునేందుకకు విచారణ చేపట్టినట్లు ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ వరుస ట్వీట్లలో చాలా అంశాలను ప్రస్తావించింది. ఇటీవల భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3కు సంబంధించిన శకలం అయ్యి ఉండొచ్చనే ఊహాగానాలకు దారితీసింది. అయితే దీనిని ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ దానిని ధృవీకరించలేదు. దీనిపై భారతీయ అంతరిక్ష సంస్థ కూడా స్పందించలేదు.
పాత PSLV ప్రయోగం నుంచి విడిపోయిన శకలంమై ఉండొచ్చనే మరో ప్రచారం జరుగుతోంది. ఇటీవల షార్ కేంద్రం నుంచి భారత్ చంద్రయాన్ -3 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించింది. అత్యంత బరువైన ఈ రాకెట్, లాంచ్ వెహికల్ మార్క్-III ద్వారా భూమికి నిర్ణీతమైన ఎత్తులో తిరుగుతోంది. ఇది గగనతలంలో ఆస్ట్రేలియా ఖండం మీదుగా వెళ్తూ కనిపించడం ఇక్కడ అందరూ ప్రస్తావిస్తున్నారు.
దాని దగ్గరకు ఎవరూ వెళ్లొద్దు
పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలో గ్రీన్ హెడ్ తీరంలో గుర్తించిన ఈ మిస్టరీ వస్తువు గురించి తాము విచారణ చేస్తున్నామని ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ వరుస ట్వీట్లలో తెలిపింది. అప్పటి వరకు పర్యటకులు, ప్రజలు, స్థానికులు ఆ వస్తువుకు దూరంగా ఉండాలని, దానిని తరలించే ప్రయత్నం మానుకోవాలని ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ కోరింది. ఈ వస్తువు 2 మీటర్ల ఎత్తు, దాదాపు 2 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. ఇది రాకెట్ మూడో దశగా ఊహాగానాలకు దారితీసింది. భూమిపై ఉన్న వ్యక్తుల భద్రత దృష్ట్యా రాకెట్ వ్యర్థాలు, బూస్టర్‌లు, అంతరిక్ష నౌక శిథిలాలు, వ్యర్థాలు సముద్రంలో పడేలా ప్రయోగాలు జరుగుతాయి. అంతే కాకుండా శిథిలాలను సజావుగా జారవిడిచేందుకు ప్రయోగానికి ముందే కచ్చితమైన జోన్‌ను ఎంపిక చేస్తారు.
ఏదైనా కనిపిస్తే సమాచారం ఇవ్వండి..
ఏదైనా అనుమానిత శిథిలాలను గుర్తిస్తే స్థానిక అధికారులు, ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీఅధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించింది. శిథిలాల నివారణతో సహా, అంతరిక్ష కార్యకలాపాల స్థిరత్వానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో దీనిపై చర్చిస్తూనే ఉంటామని ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది.
అమెరికా, రష్యా, చైనా సరసన భారత్..!
చంద్రుడిపై ఉపరితలంపై పరిశోధనలు చేసేందుకు భారత్ చంద్రయాన్-3 మిషన్ చేపట్టింది. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌లో ప్రపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్ ఉంటాయి. ఇవే చంద్రుడిపై ఉన్న కీలక సమాచారాన్నంతా భూమికి చేరవేస్తాయి. ఈ ప్రాజెక్ట్‌కి అయిన ఖర్చు రూ.615 కోట్లు. ఇండియా మాత్రమే కాదు. ఈ మూన్ రేస్ (Moon Race)లో ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా ఉన్నాయి. ఆ దేశాలు ఇప్పటికే సాఫ్ట్ ల్యాండింగ్‌తో సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు మిగిలింది ఇండియా వంతు. చంద్రయాన్ 3 విజయం సాధిస్తే..అమెరికా, రష్యా, చైనాతో పాటు భారత్ కూడా చరిత్ర సృష్టిస్తుంది. చంద్రయాన్ 2ని తయారు చేసిన ప్లాట్‌ఫామ్‌పైనే చంద్రయాన్ 3ని తయారు చేశారు. ఈ మిషన్‌తో చాలా అడ్వాన్స్‌డ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని చంద్రుడిపైకి మోసుకెళ్లనున్నారు.
2020లో ఇండియన్ స్పేస్ ఎకానమీ విలువ 9.6 బిలియన్ డాలర్లుగా ఉంది. 2025 నాటికి ఇది 13 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా స్పేస్ ఇండస్ట్రీకి సంబంధించి 140 కంపెనీలున్నాయి. మూన్ రేస్‌లో దూసుకుపోతున్న ఇండియా అమెరికాకి చెందిన మూన్ మిషన్ Artemisతో ఒప్పందం కుదుర్చుకుంది. అవసరమైతే విదేశాల సహకారమూ తీసుకుంటామన్న సంకేతాలిచ్చింది. స్పేస్‌పై పట్టు సాధించాలన్న భారీ లక్ష్యంతో ఉన్నాయి అమెరికా, చైనా. మూన్ మిషన్ కోసం చైనా, రష్యా చేతులు కలిపాయి. కానీ...ఇండియా మాత్రం సొంతగా ఈ మిషన్‌ని చేపట్టడం సాహసమే.