Morbi bridge collapse: కేబుల్ బ్రిడ్జి ప్రమాదంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం
Morbi bridge collapse: గుజరాత్ కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతాపం వ్యక్తం చేశారు.
![Morbi bridge collapse: కేబుల్ బ్రిడ్జి ప్రమాదంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం Morbi bridge collapse: Russian President Putin expresses condolences to families of Morbi bridge collapse victims Morbi bridge collapse: కేబుల్ బ్రిడ్జి ప్రమాదంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/28/031c245489ad6e4be9ccd3f88b8cc9501666961906581224_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Morbi bridge collapse: గుజరాత్ మొర్బీ కేబుల్ బ్రిడ్జి ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ గాయపడ్డ వాళ్లు త్వరగా కోలుకోవాలని పుతిన్ ఆకాక్షించారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి, ప్రధాని మోదీలను ఉద్దేశిస్తూ.. పుతిన్ సంతాప ప్రకటనగా క్రెమ్లిన్ ఒక సందేశం విడుదల చేసింది.
ఇలా ప్రమాదం
మోర్బీ నగరంలోని మచ్చు నదిపై బ్రిటీష్ కాలం నాటి తీగల వంతెన ఆదివారం కుప్పకూలింది. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 500 మంది ఉన్నట్లు సమాచారం. వంతెన కూలడం వల్ల చాలామంది నీటిలో పడి గల్లంతయ్యారు. సందర్శకులు నదిలో పడిపోగానే ఆ ప్రాంతంలో భీతావహ పరిస్థితులు కనిపించాయి.
ఈతరాని వారు మునిగిపోగా.. చాలామంది రక్షించాలంటూ హాహాకారాలు చేశారు. ఒకరిపై ఒకరు పడడం వల్ల కొంతమంది గాయపడ్డారు. మరికొంతమంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తీగలను పట్టుకుని వేలాడుతూ కనిపించారు. నీళ్లలో మునిగిపోతున్నవారిని రక్షించేందుకు మరి కొంతమంది ప్రయత్నించారు. వంతెన కూలిన ప్రమాద విషయం తెలియగానే అగ్నిమాపక విభాగం అధికారులు, పోలీసులు, ఇతర సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గల్లంతైనవారి కోసం పడవల సాయంతో గాలింపు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 134 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 177 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.
పరిహారం
వంతెన కూలిన ఘటనపై కేసు నమోదు చేసిన గుజరాత్ సర్కార్ విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. గుజరాత్ సర్కార్ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేల చొప్పున అందజేయనున్నట్లు తెలిపింది.
ప్రధాని సంతాపం
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.
" ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ దుఃఖ సమయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా మృతుల కుటుంబాలకు అండగా ఉంది. గుజరాత్ ప్రభుత్వం నిన్నటి నుంచి సహాయక చర్యలు చేపట్టింది. కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం చేస్తోంది. నేను ఏక్తా నగర్‌లో ఉన్నాను కానీ నా మనసు మాత్రం మోర్బీ బాధితులతోనే ఉంది. నా జీవితంలో చాలా అరుదుగా నేను ఇలాంటి బాధను అనుభవించి ఉంటాను. "
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)