Telangana News: సింగరేణి కార్మికులకు మంత్రి పొంగులేటి వరాలు - నేటితో ప్రచారానికి తెర, ఈ నెల 27న పోలింగ్
Singareni Elections: సింగరేణి కార్మికులకు మంత్రి పొంగులేటి వరాల జల్లు కురిపించారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఉద్యోగాల భర్తీ, వడ్డీ లేని రుణాలపై హామీలిచ్చారు.
Minister Ponguleti Key Guarantees to Singareni Workers: సింగరేణి కార్మికులపై (Singareni Workers) మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasareddy) వరాల జల్లు కురిపించారు. సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేపడతామని, కార్మికులకు ఇంటి స్థలం, రూ.20 లక్షల వడ్డీ లేని రుణం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు (Illandu), కొత్తగూడెంలో (Kothagudem) సోమవారం నిర్వహించిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కార్మికుల వైద్యానికి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని, ఎలాంటి ఖర్చు లేకుండా కారుణ్య నియామకాలు చేపడతామని అన్నారు. ‘సింగరేణి దినోత్సవం రోజున సెలవుగా ప్రకటిస్తాం. మహిళా కార్మికులు గని లోపల కాకుండా బయటే పని చేసే అవకాశం కల్పిస్తాం. కార్మికుల న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరిస్తాం.’ అని మంత్రి స్ఫష్టం చేశారు.
'కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం'
సింగరేణి వ్యాప్తంగా ఒక్క చోట మినహా అన్ని చోట్లా కాంగ్రెస్ విజయం సాధించిందని, కార్మికుల గుండెల్లో కాంగ్రెస్ ఉందని మంత్రి పొంగులేటి అన్నారు. కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీయూసీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 'గతంలోనే జరగాల్సిన ఎన్నికలను ఓటమి భయంతో గత ప్రభుత్వం నిర్వహించలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నేను మంత్రిగా ఉన్నా. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఎం పక్కన కూర్చునైనా సంతకం పెట్టిస్తాను. గత ఐదేళ్లలో సింగరేణి గనులు కనుమరుగై కార్మికుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. పోరాటాలు చేశాం అని చెప్పుకొనే కార్మిక సంఘాలు ఇక ఉండవు. 20 ఏళ్లు ప్రభుత్వంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే.' అని మంత్రి వ్యాఖ్యానించారు. అటు పెద్దపల్లిలో (Peddapalli) కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ (INTUC) తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు (Minister Sreedhar Babu) పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సొంతింటి కలను నిజం చేస్తామని, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి హైపవర్ కమిటీ వేస్తామని, INTUC కార్మిక సంఘాన్ని గెలిపించాలని కోరారు.
నేటితో ప్రచారానికి తెర
దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత జరుగుతున్న సింగరేణి సంస్థ కార్మిక సంఘం ఎన్నికల ప్రచారానికి నేటితో తెర పడనుంది. ఈ నెల 27న (బుధవారం) గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు 13 గుర్తింపు పొందిన సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ పడుతుండగా, కార్మిక శాఖ అందించిన వివరాల ప్రకారం మొత్తం 39వేల 832 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారగా, గత 20 రోజులుగా ప్రచారం హోరెత్తించారు. భూపాలపల్లి సింగరేణి డివిజన్ లో ఓపెన్ కాస్ట్ లతో కలుపుకొని 5 గనులు ఉండగా, ఇందులో 5,350 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సింగరేణి వ్యాప్తంగా 86 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి, అనంతరం అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.