Mekapati Gautham Reddy: రాజకీయాల్లోకి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి, ఉప ఎన్నికల్లో పోటీకి సై!
Nellore Politics: జిల్లా రాజకీయాల్లో ఊహించని ఘటన జరిగింది. ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలో దిగేందుకు రంగం సిద్ధమైంది.
Mekapati Gautham Reddy: నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఊహించని ఘటన జరిగింది. మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా గౌతమ్ భార్య శ్రీకీర్తి పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా గౌతమ్ రెడ్డి తమ్ముడు విక్రమ్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. త్వరలో జరగబోతున్న ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలో దిగేందుకు రంగం సిద్ధమైంది.
విక్రమ్ రెడ్డి నేపథ్యం..
గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి ప్రస్తుతం బిజినెస్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఊటీలోని గుడ్ షెఫర్డ్ పబ్లిక్ స్కూల్లో ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఐఐటీ చెన్నైలో సివిల్ ఇంజనీరింగ్ లో బీ.టెక్ చేశారు. అమెరికాలో కన్ స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లో ఎం.ఎస్ చదివారు. విక్రమ్ రెడ్డికి సౌమ్యుడు, మృధుస్వభావిగా పేరుంది. మేకపాటి గౌతమ్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి విక్రమ్ రెడ్డి 'కేఎంసీ' సంస్థకి మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు.
గౌతమ్ రెడ్డికి ఇద్దరు సోదరులు. వారిద్దరూ ఇప్పుడు బిజినెస్ వ్యవహారాలు చూస్తున్నారు. రాజకీయాల్లోకి రాక మునుపు గౌతమ్ రెడ్డి కూడా కుటుంబ వ్యాపారాల్లో బిజీగా ఉండేవారు. తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి వారసుడిగా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో అనతికాలంలోనే తనదైన ముద్రవేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. 2019లో కూడా ఆయన వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. జగన్ కు సన్నిహితుడు కావడం, మేకపాటి కుటుంబంతో జగన్ కి ఉన్న అనుబంధంతో గౌతమ్ రెడ్డి తొలి దఫాలోనే పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా పదవి పొందారు. చనిపోయే వరకు పదవిలోనే ఉన్న గౌతమ్.. ఆ శాఖపై తనదైన ముద్ర వేశారు.
అయితే గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఒక్కసారిగా మేకపాటి కుటుంబం వార్తల్లోకెక్కింది. గౌతమ్ వారసులు ఎవరనే చర్చ నడిచింది. దాదాపుగా గౌతమ్ భార్య శ్రీ కీర్తికి అవకాశం ఇస్తారని అనుకున్నారంతా. కానీ ఎక్కడా ఎప్పుడూ ఆమె పేరుని అధికారికంగా చెప్పలేదు. ఆమె పేరుని ఖరారు చేయలేదు. స్థానిక నాయకులు కూడా ఈ విషయంపై నోరు మెదపలేదు. తాజాగా ఇప్పుడు మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు, విక్రమ్ రెడ్డి పేరు తెరపైకి రావడం మాత్రం విశేషమే. ఇప్పటికే తమ నిర్ణయాన్ని రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ద్వారా మేకపాటి కుటుంబం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆత్మకూరు ఉపఎన్నికల్లో విక్రమ్ రెడ్డి బరిలో దిగడం దాదాపు ఖరారైంది.
మంత్రి పదవి ఇస్తారా..?
మేకపాటి కుటుంబంపై జగన్ కు అభిమానం ఉంది. గౌతమ్ రెడ్డి చనిపోవడంతో ఆయన స్థానంలో ఆయన భార్య శ్రీ కీర్తికి అవకాశమిచ్చి ఆమెను మంత్రి చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు విక్రమ్ రెడ్డి తెరపైకి వచ్చారు. కుటుంబం అంతా చర్చించుకుని విక్రమ్ పేరుని ఖరారు చేసింది. మరి జగన్ మంత్రి వర్గ విస్తరణలో మేకపాటి కుటుంబానికి న్యాయం చేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.