Mark Zuckerberg: మా జాబ్‌ల పరిస్థితేంటి? మిమ్మల్ని ఎలా నమ్మమంటారు? - జుకర్‌బర్గ్‌ను నిలదీసిన ఉద్యోగులు
Mark Zuckerberg: మార్క్ జుకర్‌బర్గ్‌ను ఉద్యోగులందరూ ప్రశ్నలతో నిలదీశారు.
Mark Zuckerberg:
మీటింగ్‌లో ప్రశ్నల వర్షం..
మెటాలో భారీ సంఖ్యలో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. ఆ మధ్య 10 వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించి సంస్థ...ఇటీవలే మరో 10 వేల మందిని ఇంటికి పంపనున్నట్టు ప్రకటించింది. కాస్ట్ కటింగ్‌లో భాగంగా తప్పడం లేదని సీఈవో జుకర్ బర్గ్ చెబుతున్నా ఆ కంపెనీపై అసహనం అయితే పెరుగుతోంది. ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులకూ జాబ్ గ్యారెంటీ లేకుండా పోతోంది. ఇలాంటి కీలక తరుణంలో ఉద్యోగులతో మీటింగ్ పెట్టారు జుకర్‌బర్గ్. మార్చి 16న ఈ సమావేశం జరిగినట్టు The Washington Post వెల్లడించింది. అయితే...ఈ మీటింగ్‌లో ఉద్యోగులందరూ జుకర్‌బర్గ్‌పై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. కంపెనీ పరిస్థితేంటి అని నేరుగానే ఉద్యోగులు జుకర్‌ను ప్రశ్నించారని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. అటు జుకర్ బర్గ్ మాత్రం కంపెనీ రీఆర్గనైజేషన్ గురించి మాట్లాడారట. వర్క్‌ఫ్రమ్ హోమ్ గురించి కూడా అడగ్గా...దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని సమాధానమిచ్చారు జుకర్‌బర్గ్.
"జుకర్‌బర్గ్‌ను ఉద్యోగులు ఎన్నో ప్రశ్నలు వేశారు. ఈ కంపెనీని ఎలా నమ్మమంటారు అని ప్రశ్నించారు. ఇప్పటికే రెండు రౌండ్‌ల లేఆఫ్‌లు పూర్తయ్యాక...జాబ్ సెక్యూరిటీ పరిస్థితేంటని అడిగారు. అయితే అందుకు జుకర్‌బర్గ్ కూడా సమాధానం చెప్పారు. కేవలం పర్‌ఫార్మెన్స్ ఆధారంగానే లేఆఫ్‌లు చేపడుతున్నట్టు వివరించారు. ఎంప్లాయిస్ అందరూ తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. మనం పెట్టుకున్న ఏ మేరకు చేరుకుంటున్నాం అనే దానిపైనే ఈ లేఆఫ్‌లు ఉంటాయని చెప్పారు. మనం సాధించాల్సింది ఇంకా చాలా ఉందని అన్నారు. "
- వాషింగ్టన్ పోస్ట్
10 వేల మంది..
మెటా ప్లాట్‌ఫామ్ మరోసారి 10 వేల ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. నాలుగు నెలల క్రితం 11 వేల మందిని తొలగించిన కంపెనీ రెండో రౌండ్‌లోనూ అదే స్థాయిలో ఉద్యోగులను ఇంటికి పంపాలనుకుంటోంది. ‘మా బృందం పరిమాణం 10 వేల మందిని తగ్గించనున్నాం, 5000 అదనపు ఉద్యోగుల నియామకం కూడా ఉండదు’ అని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. ఇప్పటికే కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 13 శాతం (11 వేల మంది) ఉద్యోగులను తొలగించగా, ఇప్పుడు కూడా ఖర్చులను తగ్గించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కోత పెట్టనుంది. మెటాలో పునర్నిర్మాణ పనులు విస్తరించడం, తక్కువ ప్రాధాన్యత ప్రాజెక్టులను రద్దు చేయడం, నియామకాల తగ్గింపు వంటి అంశాలు లేఆఫ్‌కు కారణమని కంపెనీ వెల్లడించింది. వార్షికంగా ఖర్చులను 95 బిలియన్ డాలర్ల నుంచి 89 బిలియన్ డాలర్లకు కుదించాలన్న మార్క్ జుకర్‌బర్గ్ ఆలోచనకు అనుగుణంగానే ఉద్యోగులను మెటా తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉండగా, 2022 సంవత్సరం నుంచి ఇప్పటివరకు దాదాపు 2.90 లక్షల మందిపై వేటుపడింది. దీనిలో 40 శాతం కోతలు 2023లో జరిగాయని లేఆఫ్ ట్రాకింగ్ సైట్ లేఆఫ్స్.ఎఫ్‌వైఐ (https://layoffs.fyi/) వెల్లడించింది. మార్క్ జుకర్‌బర్గ్ నిర్ణయంతో 2023 `ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీ`గా నిలుస్తుందని చెబుతున్నారు. కానీ ఊహించని విధంగా జుకర్‌బర్గ్‌కు ప్రశ్నల దాడి మొదలైంది.
Also Read: సరిహద్దులో అంతా ప్రశాంతంగానే ఉంది, అయినా సైనిక మొహరింపులు మాత్రం ఆగవు - ఆర్మీ చీఫ్