ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట, బాంబే హైకోర్టు కీలక తీర్పు
Bombay High Court: మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి ఎన్ సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా తేల్చింది.
Prof Saibaba Is Not Guilty Bombay High Court: మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి ఎన్ సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. ఆయనకు విధించిన జీవిత ఖైదును రద్దు చేస్తూ మంగళవారం న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. మావోయిస్టులతో లింకులు ఉన్నాయనే ఆరోపణలతో మహారాష్ట్ర పోలీసులు ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఆయన్ని నివాసంలో మావోయిస్టు సాహిత్య పుస్తకాలు దొరికాయని ఆరోపించారు. ఆయనను గచ్చిరోలి సెషన్స్ కోర్టులో హాజరపరిచారు. 2017లో సెషన్స్ కోర్టు ఆయనను దోషిగా తేల్చి జైలుకు పంపించింది. ఆరోపణలపై విచారణ జరిపిన సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. కొన్నాళ్లపాటు జీవితాన్ని జైలలోనే గడిపిన ప్రొఫెసర్ సాయిబాబా.. తనకు విధించిన శిక్ష పై ఉన్నత స్థాయి కోర్టులో అప్పీల్ చేశారు.
అనారోగ్యంతో జైలులోనే సాయిబాబా..
సాయిబాబా గడిచిన కొన్నాళ్లుగా జైలులోనే జీవితాన్ని గడుపుతున్నారు. అనారోగ్యం బారిన పడిన సాయిబాబా ప్రస్తుతం నాగపూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. సెషన్స్ కోర్టు తీర్పుపై ప్రొఫెసర్ సాయిబాబా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 2022 అక్టోబర్ 14న ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా బాంబే హైకోర్టు ప్రకటించింది. సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. అయితే ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా బాంబే హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. దీనిపై మరోసారి విచారణ జరపాలని బాంబే హైకోర్టును ఆదేశించింది. దీనిపై మరోసారి విచారణ జరిపిన బాంబే హైకోర్టు తాజాగా మంగళవారం ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. తాజా తీర్పు ప్రొఫెసర్ సాయిబాబాకు ఉపశమనాన్ని కలిగించనుంది. బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు కలగజేసుకుంటుందా..? మళ్లీ మహారాష్ట్ర ప్రభుత్వం దీనిపై పోరాటానికి సిద్ధపడుతుందా అంటే కొన్నిరోజులు వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా తాజా తీర్పుతో ప్రొఫెసర్ సాయిబాబాకు జైలు నుంచి విముక్తి లభించే అవకాశం కనిపిస్తోంది.