Maoist Leader Hidma: హిడ్మా చనిపోలేదు, అదంతా కేంద్రం కుట్ర- మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటన
Maoist Leader Hidma: మావోయిస్టు అగ్రనేత చనిపోయాడన్న వార్తల్లో నిజం లేదని హిడ్మా బతికే ఉన్నాడని మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖ విడుదల చేసింది. హిడ్మా చనిపోయాడన్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది.
Maoist Leader Hidma: నిన్న బుధవారం తెలంగాణ - ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మరణించలేదని, క్షేమంగానే ఉన్నాడని మావోయిస్టు కేంద్ర కమిటీ ఓ లేఖ విడుదల చేసింది. మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(PLGA) మొదటి బెటాలియన్ కమాండర్ మాడ్వి హిడ్మా చనిపోయాడని పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో ఎలాంటి వాస్తవం లేదని మావోయిస్టు సెంట్రల్ కమిటీ లేఖలో పేర్కొంది.
'హిడ్మా బతికే ఉన్నాడు'
తెలంగాణ - ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పోలీసులకు మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు ప్రకటించారు. గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ కోబ్రా జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. హిడ్మానే ప్రధాన లక్ష్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎన్ కౌంటర్ లో హిడ్మా చనిపోలేదని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటన విడుదల చేసింది. మావోయిస్టు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పేరుతో లేఖ విడుదల అయింది.
కేంద్ర కమిటీ సభ్యుడి హిడ్మా చనిపోలేదని, చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, హిడ్మా సురక్షితంగానే ఉన్నాడని ఆ లేఖలో పేర్కొన్నారు. హిడ్మా చనిపోయాడంటూ పోలీసు అధికారులు చేసిన ప్రకటన కుట్రలో భాగమని విమర్శించారు. దక్షిణ బస్తర్ జంగిల్ కొండలపై పోలీసులు, సీఆర్పీఎఫ్ లు సంయుక్తంగా డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా దాడులు చేశాయని పేర్కొన్నారు.
'రాత్రి పగలు తేడా లేకుండా వైమానిక దాడులు'
గత ఏడాది ఏప్రిల్ నెలలో కూడా దక్షిణ బస్తర్ అడవుల్లో పోలీసులు వైమానిక బాంబు దాడులు చేశాయని మావోయిస్టు సభ్యులు తెలిపారు. మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని దెబ్బ తీయాలని వందల సంఖ్యలో బాంబులు వేస్తున్నారని వెల్లడించారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఆకాశం నుంచి నిఘా పెట్టి మరీ దాడి చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికలలోపు మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనలో భాగంగానే పోలీసులు దాడులు తీవ్రతరం చేశారని తెలిపారు. ప్రకటనలూ కూడా అందులో భాగంగానే విడుదల చేస్తున్నట్లు ఆరోపించారు.
పోలీసు అధికారులు చేస్తున్న దాడుల వల్ల సాధారణ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని మావోయిస్టు కేంద్ర కమిటీ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. ప్రజలు పొలాలకు కూడా వెళ్లలేకపోతున్నారని తెలిపారు. ప్రపంచంలోనే అన్ని ప్రగతి శీల కూటములు ఏకం కావాలని, యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడాలని లేఖలో మావోయిస్టులు పిలుపు ఇచ్చారు.
హిడ్మా చనిపోయాడంటూ ప్రకటనలు రావడం, వార్తలు రావడం ఇదే మొదటిసారి ఏం కాదు. మావోయిస్టు అగ్రనేత చనిపోయాడంటూ గతంలోనూ పలు ప్రకటనలు వెలువడ్డాయి. అయితే అవేవీ నిజం కాదని హిడ్మా బతికే ఉన్నాడని తర్వాత తెలిసింది. మాడ్వి హిడ్మా దక్షిణ బస్తర్ ప్రాంతంలోని సుక్మా జిల్లాలో జన్మించాడు. పువర్తి గ్రామ స్థానికుడైన హిడ్మా అక్కడి ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి. క్రమంగా మావోయిస్టు విధానాలకు ఆకర్షితుడై అనతికాలంలో ఎదిగాడు. కేంద్ర కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నాడు. హిడ్మా లక్ష్యంగా భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.