JetBlue Plane : విమానంలో గర్ల్ ఫ్రెండ్‌తో గొడవ - మద్యం మత్తులో ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసేందుకు యువకుడి యత్నం
Crime News: ఓ వ్యక్తి మద్యం తాగి విమానం ఎక్కాడు. అంతటితో ఆగకుండా తన గర్ల్ ఫ్రెండ్‌తో గొడవపడ్డాడు. విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి దూకే ప్రయత్నం చేశాడు.
JetBlue Plane : విమానం ఎక్కి తోటి ప్యాసెంజర్స్‌తో అనుచితంగా ప్రవర్తించడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. దీనికి సంబంధించిన ఘటనలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడమూ చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ యువకుడు ఫుల్లుగా మందు తాగి విమానమెక్కాడు. అంతటితో ఆగకుండా తన గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవపడి.. తీవ్రమైన చర్యకు పాల్పడ్డాడు. అతను చేసిన ఓ పని వల్ల.. విమానంలో ప్రయాణిస్తోన్న 160 మంది ప్రయాణికుల భద్రతకు ప్రమాదం ఏర్పడింది. అంతలోనే అప్రమత్తమైన సిబ్బంది.. యువకుడిని అడ్డుకుని ముప్పు తప్పించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ప్యూర్టోరికోకు చెందిన మోరెల్స్ టెర్రోస్ (Morels Terrors) అనే యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి జనవరి 7న రాత్రి లారెన్స్ లొగాన్ ఎయిర్‌పోర్ట్‌లో జెట్‌బ్లూ ఎయిర్‌లైన్ (JetBlue Airline) విమానం ఎక్కాడు. శాన్ జౌన్‌కు వెళ్తోన్న ఈ జంట మధ్య ఏదో విషయంపై వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపంలో ఉన్న టెర్రోస్.. విమానం ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ తెరిచి, కిందికి దూకేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా తోటి ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. క్యాబిన్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ యువకుడిని అడ్డుకున్నారు. అనంతరం సమీపంలోని విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. భద్రతా సిబ్బందికి యువకుడిని అప్పగించారు. ఆ తర్వాత మసాచుసెట్స్ పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరిచారు. అనంతరం విచారణ జరిపిన న్యాయస్థానం.. మసాచుసెట్స్‌కి తప్ప భవిష్యత్తులో మరే ప్రాంతానికి ప్రయాణం చేయరాదని ఆదేశించింది. ఘటన తర్వాత అందులోని ప్రయాణికులను మరో విమానంలో తరలించినట్టు జెట్‌బ్లూ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. అమెరికాలోని లారెన్స్ లోగాన్ విమానాశ్రయం(Lawrence Logan Airport)లో ఈ ఘటన చోటుచేసుకుంది.
అధికారుల విచారణ
విమానంలో జరిగిన ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (Federal Aviation Administration) అధికారులు విచారణ చేపట్టారు. ఆ సమయంలో విమానంలో 161 మంది ప్రయాణిస్తున్నారని, ఆ యువకుడి వల్ల వారంతా చాలా భయపడ్డారని తెలిపారు. గత నెలలోనూ అలస్కా ఎయిర్‌లైన్స్ విమానంలోనూ ఓ ప్రయాణికుడు ఇలాగే చేశాడు. ఎమర్జెన్సీ డోర్ తెరిచి.. విమానం రెక్కపైకి ఎక్కాడు. అయితే ఆ సమయానికే తోటి ప్రయాణికులంతా విమానం దిగిపోవడంతో ప్రమాదం తప్పింది.