మమతా బెనర్జీ లేని కూటమిని ఊహించలేం - జైరాం రమేశ్ కీలక వ్యాఖ్యలు
Mamata Banerjee: మమతా బెనర్జీ లేని కూటమిని ఊహించలేమని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ వెల్లడించారు.
Mamata Banerjee Vs Congress: కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల విషయంలో తృణమూల్ కాంగ్రెస్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అక్కడ 42 లోక్‌సభ స్థానాలున్నాయి. కాంగ్రెస్ కాస్త భారీ సంఖ్యలో సీట్‌లు ఆశిస్తోంది. కానీ తృణమూల్ కాంగ్రెస్ మాత్రం అందుకు అంగీకరించడం లేదు. చాలా చర్చల తరవాత స్వయంగా మమతా బెనర్జీ ఓ ప్రకటన చేశారు. బెంగాల్‌లో కాంగ్రెస్‌తో సీట్‌లు పంచుకునేందుకు సిద్ధంగా లేమని మొత్తం 42 చోట్లా తామే నిలబడతామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కూటమిలో చీలికలు మొదలయ్యాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అటు నితీశ్ కుమార్ కూడా రేపోమాపో కూటమిని వదిలెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్‌తో సీట్‌ల షేరింగ్ సమస్యని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. మమతా బెనర్జీ లేకుండా I.N.D.I.A కూటమి ఊహించుకోలేమని అన్నారు. బీజేపీతో పోరాడే సత్తా ఆమెకు ఉందని గట్టిగా విశ్వసిస్తున్నామని స్పష్టం చేశారు.
"బెంగాల్‌లోనే కాదు దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించాలంటే మాకు మమతా బెనర్జీ సహకారం చాలా అవసరం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేకి ఆమె పట్ల ఎంతో గౌరవముంది. మా కూటమికి ఆమె ఎంతో కీలకం. తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ లేకుండా అసలు ఈ కూటమిని ఊహించుకోలేం"
- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత
న్యాయ్ యాత్రకు ఆహ్వానం..
సీట్ షేరింగ్ సమస్య గురించి రన్నింగ్ కామెంట్రీ ఇచ్చే ఉద్దేశం తనకు లేదని, కానీ దీనికి ఓ పరిష్కారం వెతికే ప్రయత్నాన్ని మాత్రం మానుకోలేదని వెల్లడించారు జైరాం రమేశ్. ప్రస్తుతం రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో న్యాయ్ యాత్ర బెంగాల్‌లోకి ప్రవేశించింది. ఈ యాత్రలో పాల్గొనాలని మమతా బెనర్జీని కోరినట్టు జైరాం రమేశ్ చెప్పారు.
"భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనాలని మమతా బెనర్జీకి రెండు సార్లు ఆహ్వానం పంపించాం. మా అందరి లక్ష్యం ఒక్కటే. అందుకే ఆమెని స్వాగతించాం. దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటాం"
- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Benarjee) ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిపై నిప్పులు చెరిగారు. రాహుల్(Rahul) పాదయాత్ర నిర్వహిస్తున్నాడట. మా రాష్ట్రానికి పక్కనే ఉన్న మణిపూర్(Manipur)లో ప్రారంభించాడట. కానీ, మాకు మాట మాత్రమైనా చెప్పులేదు. ఎక్కడో ఉన్నవారిని ఆహ్వానించారు. ఏం మేం యాత్రకు పనికి రాలేదా? లేక మాకు చెప్పకూడదని అనుకున్నారా? కానీ, మేం వారికి అవసరం. ఈ విషయాన్ని వారు గుర్తుంచుకోవాలి అని మమత బుధవారం వ్యాఖ్యానించారు. అంతేకాదు.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సీట్ల పంపకాల విషయంపైనా పైనా ఆమె అదే స్థాయిలో వ్యాఖ్యలు సంధించారు. మొత్తంగా తామే పోరాడతామని అన్నారు. ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నామన్న సంకేతాలు ఇచ్చేశారు.
Also Read: మరో రెండు రోజుల్లో బీజేపీతో పొత్తుపై తుది నిర్ణయం, ఆరోజే సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారం?