Maharashtra Political Crisis: దమ్ముంటే ఎన్నికల బరిలోకి దిగండి, రెబల్ ఎమ్మెల్యేలకు ఆదిత్య థాక్రే ఛాలెంజ్
శివసేన పార్టీకి రాజీనామా చేసి ఎన్నికల బరిలో దిగాలంటూ ఆదిత్య థాక్రే రెబల్ ఎమ్మెల్యేలకు సవాలు విసిరారు.
ఏం జరిగినా మా మంచికే: ఆదిత్య థాక్రే
ఏక్‌నాథ్ షిండేతో సహా రెబల్ ఎమ్మెల్యేలంతా పార్టీకి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగాలంటూ సవాల్ విసిరారు ఉద్దవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే. వారం రోజులుగా ఎమ్మెల్యేలు షిండే శిబిరంలోనే ఉండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పార్టీని వీడిన ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ పార్టీలోని మురికి అంతా వెళ్లిపోయిందని, ఏం జరిగినా అది మంచికేనని ఘాటుగా వ్యాఖ్యానించారు ఆదిత్య థాక్రే. "మా పార్టీగానీ, ఉద్దవ్ థాక్రే కానీ ఏదైనా తప్పు చేసుంటే వెంటనే పార్టీకి రాజీనామా చేసేయండి. తరవాత ఎన్నికల బరిలోకి దిగండి" అని ఆ ఎమ్మెల్యేలకు చురకలు అంటించారు.
నిజానికి, అబద్ధానికి మధ్య యుద్ధమిది: ఆదిత్య థాక్రే
ఇది నిజానికి, అబద్ధానికి మధ్య జరుగుతున్న యుద్ధమని, ఈ వెన్నుపోటుని ఎప్పటికీ మర్చిపోమని అన్నారు ఆదిత్య థాక్రే. ఎన్నికల బరిలోకి దిగితే విజయం తప్పకుండా తమవైపే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదంతా భాజపా కుట్రేనని, ఆ పార్టీ తమను నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కొత్త వారికి అవకాశమిస్తామని, ముఖ్యంగా యువతకు, మహిళలకు ప్రాధాన్యత దక్కుతుందని స్పష్టం చేశారు. అటు సంజయ్ రౌత్ కూడా తన మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. "ఎన్నాళ్లు దాక్కుంటారో దాక్కోండి, ఎప్పటికైనా మళ్లీ ఇక్కడికే రాక తప్పదు" అని రెబల్ ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ సెటైర్లు వేశారు. డిప్యుటీ స్పీకర్ ఫోటోని జత చేసి ట్విటర్‌లో ఈ వ్యాఖ్యల్ని జోడించారు సంజయ్ రౌత్.
कब तक छीपोगे गोहातीमे..
— Sanjay Raut (@rautsanjay61) June 26, 2022
आना हि पडेगा.. चौपाटीमे.. pic.twitter.com/tu4HcBySSO
వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవు..
ఇప్పటికే రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర సెక్రటేరియెట్ సమన్లు జారీ చేసింది. జూన్ 27 సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని ఆయా ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర విధాన్ భవన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంగ్ర భగవత్ ఈ సమన్లు జారీ చేశారు. డిప్యుటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌కు చీఫ్ విప్ సునీల్ ప్రభు ఓ లేఖ రాశారు. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇందులో ప్రస్తావించారు. నిర్దేశిత గడువులోగా రెబల్ ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వకపోతే, కఠిన చర్యలు తప్పవని ఆ లేఖలో పేర్కొన్నారు. అటు ఉద్దవ్ థాక్రే కూడా రెబల్ ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా సందేశాలు పంపుతున్నారట. శనివారం పార్టీ నేతలతో సమావేశం నిర్వహించిన థాక్రే కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టారు. బాల్‌థాక్రే పేరుని గానీ, శివసేన పేరుని గానీ ఎవరూ వాడుకోటానికి వీల్లేకుండా చూడాలని, నిబంధనలు అతిక్రమిస్తే
కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఎంత కఠినమైన పరిస్థితులు ఎదురైనా పోరాడేందుకు సిద్ధమంటూ శివసేన కార్యకర్తలు ఇప్పటికే స్పష్టం చేశారు.
Also Read: India vs England 5th Test: రోహిత్‌కు కరోనా - మరి ఐదో టెస్టుకు కెప్టెన్ ఎవరు?