Konaseema District News: తప్పుడు ప్రచారం చేస్తే ఆత్మహత్యే శరణ్యం - యువకుడిపై దాడి కేసులో మహిళ వివరణ!
Konaseema District News: మొన్న యువకుడి మర్మాంగంపై దాడి చేసిన మహిళ మీడియా ముందుకు వచ్చి జరిగిన విషయం తెలిపారు. ఇందుతో తన తప్పేం లేదని, తప్పుడు ప్రచారం చేస్తే ఆత్మహత్యే శరణ్యం అని వివరించారు.
Konaseema District News: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలో ఓ మహిళ యువకుడి మర్మాంగంపై దాడి చేసిన ఘటన అందరికీ తెలిసిందే. తాను అతడి మర్మాంగంపై దాడి చేయడానికి గల కారణాలను వివరించారు ఆ మహిళ. తనపై సామాజిక మాధ్యమాలు, న్యూస్ ఛానెళ్లలో అసత్య ప్రసారాలు చేస్తున్నారని నాగిరెడ్డి దుర్గా భవాని చెప్పుకొచ్చారు. నిజంగా జరిగిన సంఘటన ఒకటైతే మరోలా ప్రచారం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఆ రోజు ఏం జరిగింతో పూసగుచ్చినట్టు చెప్పారామె.
ఘటన జరిగిన రోజు రాత్రి 8.30 గంటలకు తాము ఇంట్లో ఉండగా.. ఎవరో తలుపు కొట్టిన చప్పుడు వినిపించిందట. తన కుమారుడు వెళ్లి తలుపు తీయగా.. చుట్టాలబ్బాయి వచ్చాడని లోపలికి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. తాను వెళ్లి చూసే సరికి తన మేనత్తగారి అబ్బాయి కటిక రెడ్డి కృష్ణ గణేష్ వచ్చాడని వివరించారు.
బంధువని ఇంట్లోకి రమ్మంటే మానభంగం చేయబోయాడు..
తమకు అతడు బంధువు కావడంతో.. ఇంట్లో కూర్చోమని చెప్పగా, అతడు కూర్చున్నాడని తెలిపారు. కృష్ణ గణేష్.. గోపీ లేడా అని అడగ్గా లేడని చెప్పానని, అయితే అందుకు బదులుగా అతను కారు కావాలని వచ్చినట్లు చెప్పాడని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాగడానికి మంచినీళ్లు కావాలని కృష్ణ గణేష్ అడిగాడని తెలిపారు. తన కుమారుడికి నీళ్లు తీసుకురమ్మని చెప్పినట్లు చెప్పారు. కానీ అతడు వీడియో గేమ్ ఆడుతూ పట్టించుకోకపోవడంతో తానే కిచెన్ లోకి వెళ్లి నీళ్లు తీసుకొచ్చానని చెప్పుకొచ్చారు. అయితే హాల్లో ఉన్న అతడు వచ్చి కుర్చీలో కూర్చున్నాడని.. నీళ్లు ఇచ్చి తాను పక్కనే ఉన్న కిటీకి వద్ద నిల్చున్నానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కృష్ణ గణేష్ తన కొడుకు ఏం చేస్తున్నాడో గమనించి ఆ తర్వాత.. ఒక్కసారిగా తనపై పడి ఒక చేత్తో తనను బలవంతంగా గోడకు అదిమిపెట్టి మానభంగం చేయబోయాడని తెలిపారు. తనను తాను కాపాడుకునే క్రమంలో పక్కనే ఉన్న కిటికీలో ఉన్న బ్లేడు తీసి అతడిపై దాడికి పాల్పడినట్లు వివరించారు.
మీరిలాగే చేస్తే నాకు ఆత్మహత్యే శరణ్యం..
అతడికి ఎక్కడ గాయం అయిందో కూడా తాను గ్రహించలేనని, అతడు వెంటనే బాబాయ్, బాబాయ్ అంటూ బయటకు పరిగెత్తాడని చెప్పారు. అసలు జరిగిన సంఘటన ఇది అయితే... సామాజిక మాధ్యమాల్లో ప్రియుడు, ప్రియురాలు, దాడి అంటూ ఇష్టం వచ్చినట్లుగా రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ధైర్యంగా పోరాటం చేస్తానని నాగిరెడ్డి దుర్గా భవాని మీడియాతో తెలిపారు.
ఈ సంఘటనను తప్పుదోవ పట్టించి, అసభ్యకరమైన వార్తలు ప్రసారం చేశారని, తన పరువు మొత్తం తీశారని కన్నీటి పర్యంతం అయ్యారు. అన్నీ తెలుసుకొని, వాస్తవాలను మాత్రమే ప్రసారం చేయండని దుర్గాభవాని కోరారు. తనకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకుండా నిజాలను మాత్రమే ప్రసారం చేయమని ఆమె తెలిపారు. ఇలాగే అవాస్తవాలు ప్రసారం చేస్తూ పోతూ తాను ఆత్మహత్య చేసుకుంటానని వివరించారు. తనకేమైనా జరిగితే ఆ బాధ్యతంతా తప్పుడు ప్రచారాలు చేసిన వాళ్లదే అంటూ ఆవేదన నాగిరెడ్డి దుర్గా భవాని ఆవేదన వ్యక్తం చేశారు.