Kashmiri Pandit shot: మరో కశ్మీరీ పండిట్ హత్య, మాటు వేసి మరీ చంపిన ఉగ్రవాదులు
Kashmiri Pandit Shot: షోపియన్ జిల్లాలో కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు హత్య చేశారు.
Kashmiri Pandit Shot:
షోపియన్ జిల్లాలో..
కశ్మీర్‌లో పండిట్‌ను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు కొంత కాలం తగ్గుముఖం పట్టినట్టు అనిపించినా..మళ్లీ ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది..ఈ తరహా ఘటనలు స్థానికులకు పాత రోజుల్ని గుర్తు చేస్తున్నాయి. షోపియన్ జిల్లాలో ఉగ్రవాదులు ఓ కశ్మీరీ పండిట్‌ను హత్య చేశారు. మృతుడు పురాణ్ క్రిషన్ భట్‌గా గుర్తించారు. దక్షిణ కశ్మీర్‌లోని చౌదరి గుండ్ ప్రాంతంలో తన నివాసానికి సమీపంలో ఉండగానే...పురాణ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. అప్పటికప్పుడు షోపియన్ హాస్పిటల్‌కు తరలించినప్పటికీ..అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు బాధితుడు. ఈ దాడి జరిగిన ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పురాణ్ క్రిషన్ భట్‌కు ఇద్దరి పిల్లలున్నారు. "ఆయన బయటకు వెళ్లడానికి కూడా చాలా రోజులు భయపడిపోయాడు. ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాడు. ఈ ఘటన మాకెంతో భయం కలిగిస్తోంది." అని మృతుడి బంధువు ఒకరు అన్నారు. గతంలో ఇదే షోపియన్ జిల్లాలో ఓ యాపిల్ తోటలో కశ్మీరీ పండిట్ హత్యకు గురయ్యాడు. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆగస్టు 16న సునీల్ కుమార్‌పై ఉగ్రవాదులు
దాడి చేసి హత్య చేశారు. అతని సోదరుడు పింటు కుమార్ గాయాలతో బయటపడ్డాడు. "కశ్మీరీ ఫ్రీడమ్ ఫైటర్స్" తామే ఈ పని చేసినట్టు ప్రకటించుకుంది. స్వాతంత్య్రోద్యమ సంబరాల్లో భాగంగా తిరంగా ర్యాలీలు చేయాలని అందరినీ ప్రేరేపించినందుకే..సునీల్ కుమార్‌ని హత్య చేశామనీ చెప్పింది.
వరుస హత్యలు..
ఈ ఏడాది మే నెలలో వరుస హత్యలు కలకలం రేపాయి. గోపాల్‌పొరాలోని ఓ స్కూల్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కశ్మీరీ పండిట్ వర్గానికి చెందిన ఓ టీచర్ మృతి చెందారు. గోపాల్‌పొరాలోని ఓ హైస్కూల్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు.. సాంబా ప్రాంతానికి చెందిన ఓ మహిళా టీచర్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. తీవ్రంగా గాయపడిన ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ ఉగ్రదాడికి పాల్పడిన తీవ్రవాదులను త్వరలోనే గుర్తించి ఎన్‌కౌంటర్ చేస్తామని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో కశ్మీరీ పండిట్లపై వరుస దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. బుద్గాం జిల్లాలోని చదూర తహశీల్దారు కార్యాలయంలో రాహుల్ అనే వ్యక్తిని ఇటీవల ఉగ్రవాదులు కాల్చి చంపారు. రాహుల్ అక్కడ గుమస్తాగా పని చేస్తున్నాడు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రాహుల్.. ఆసుపత్రికి తరలించేలోపే మరణించాడు. ప్రధాన మంత్రి ప్యాకేజి పథకంలో భాగంగా చదూర తహశీల్దారు కార్యాలయంలో రాహుల్ గుమస్తాగా పని చేస్తున్నాడు. ఆయనపై గురువారం ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను బుద్గాంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయనను శ్రీనగర్‌లోని మహారాజా హరి సింగ్ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేక పోయారు.
Also Read: PFI Attacks : తెలంగాణలో దాడులకు పీఎఫ్ఐ కుట్ర, హిందూ ధార్మిక సంస్థలే టార్గెట్!