Kakinada Tiger: ఇంకా వీడని పులి బెడద! ఈ ప్రాంతంలో కొత్తగా పాదముద్రలు, ఎటు వెళ్లిందో చెప్పిన అధికారులు
ఏలేశ్వరం మండలంలోని లింగంపర్తి శివారు ప్రాంతమైన ములగల మెట్ట వద్ద సత్తెమ్మతల్లి పుంత రోడ్డు గుండా పులి వెళ్ళినట్లు అధికారులు గుర్తించారు.
కాకినాడ జిల్లా పరిధిలో పెద్దపులి జాడ ఇంకా దొరకలేదు... దాని కోసం అటవీశాఖ అధికారుల ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా చిక్కక, దొరకక.. మరికొన్ని సార్లు చిక్కినట్లే చిక్కి అటవీశాఖ అధికారులకు ముప్పు తిప్పలు పెడుతున్న పెద్ద పులి రోజుకో ఊరు మకాం మార్చుకుంటూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలోని లింగంపర్తి శివారు ప్రాంతమైన ములగల మెట్టు వద్ద పులి అడుగుజాడలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. పోతులూరు వద్ద సంచరిస్తున్న పులి అడుగు జాడలు, లింగంపర్తి వద్ద లభ్యమైన పాదముద్రలు ఒకటా లేకపోతే వేరేదా అని సైజును కొలిచారు. ఇది ఆ పులేనని నిర్ధారించుకున్నారు.
అక్కడక్కడే తిరుగుతున్నట్లు ఆనవాళ్లు
ఏలేశ్వరం మండలంలోని లింగంపర్తి శివారు ప్రాంతమైన ములగల మెట్ట వద్ద సత్తెమ్మతల్లి పుంత రోడ్డు గుండా పులి వెళ్ళినట్లు అధికారులు గుర్తించారు. అక్కడనుండి సమీపంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే సుబ్బారావు గెస్ట్ హౌస్ వద్ద పశువులపై దాడికి ప్రయత్నించింది. గెస్ట్ హౌస్ లోపల ఉన్న పశువుల శాలలో గేటు లోపలకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే అవకాశం కుదరలేదు. గేటుపై పులి ఆనవాళ్ళు పడ్డాయి. అక్కడ నుండి ఎటు వెళ్ళిందో అని అధికారులు చుట్టుపక్కల గాలించారు. అక్కడే సి.రాయవరం వైజాగ్ కాలువ వద్ద పులి అడుగుజాడలు ఉండడంతో పక్కనే ఉన్న తిమ్మ రాజు చెరువు వద్ద ఆ సమయంలో కొంత మంది ఉన్నారని వారిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే పులి రాత్రి 12 గంటల సమయంలో పెద్దగా అరుస్తూ వెళ్లిందని దీంతో తాము భయపడి చెరువు లోపలికి వెళ్ళి పోయామని అక్కడున్న వారు చెబుతున్నారు. అక్కడికక్కడే రకరకాల దారులు మారడంతో పులి ఎటు వెళ్ళిందో అంతుచిక్కడం లేదు.
ముమ్మరంగా గాలింపు
స్థానికులు చెప్పిన వివరాలు ప్రకారం సి. రాయవరం కెనాల్ రోడ్డు పై నుండి అధికారులు ముమ్మరంగా గాలించారు. చివరికి పులి అడుగుజాడలను బట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి వెళ్లే కాలువలో నీరు త్రాగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు మాత్రం ఏ నిమిషంలో ఏం జరుగుతుందనీ భయం భయంగా బ్రతుకుతున్న మని... రాత్రి పులి సంచరించడం మేము చూసామని దీంతో మరింత భయానికి గురవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. పులి మూమెంట్ ని బట్టి అది అడవి ప్రాంతం లోకి వెళ్లేందుకు పయనం సాగిస్తుంది అనుకుంటున్నామని అధికారులు అభిప్రాయ భయపడుతున్నారు. దగ్గర్లో గిరిజన పురం, రాజవొమ్మంగి, సూది కొండ ఫారెస్ట్ ఏరియా ఉన్నాయని అది మా పరిధి దాటి వెళితే వాళ్ళకు సమాచారం ఇవ్వడం జరుగుతుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి వైఆర్సీ కెనాల్ వద్ద వరకు పులి అడుగుజాడలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
మళ్లీ వెనక్కు వస్తున్న పులి
ప్రత్తిపాడు మండలం వొమ్మంగి పరిసర ప్రాంతాల్లో నుంచి పులి వెళ్లిపోయిందని ఊపిరి పీల్చుకున్న పొదురుపాక, శరభవరం, ఉత్తరకంచి, పాండవుల పాలెం ప్రజలు మళ్లీ వెనక్కు వస్తుందని తెలిసి భయ భ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతం మండల పరిధిలోని సంఖ నూతలపాడు పులి ఆనవాళ్ళు లభించాయని తెలుస్తోంది.