JK Target Killings: కశ్మీరీ పండిట్‌లే లక్ష్యంగా మళ్లీ ఉగ్ర దాడులు
JK Target Killings: కశ్మీర్ లోయలో మరోసారి ఉగ్ర కదలికలు పెరిగాయి. వరుస హత్యలతో స్థానికులు భయాందోళనకు గురి అవుతున్నారు. కశ్మీరీ పండిట్‌లు నిరసన బాట పట్టారు.
JK Target Killings: కశ్మీర్ లోయలో అంతా ప్రశాంతంగానే ఉందనుకుంటున్న తరుణంలో మరోసారి ఉగ్రవాదుల కదలికలు మొదలయ్యాయి. వరుస హత్యలతో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు ముష్కరులు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఉగ్రదాడుల్లో 16 మంది పౌరులు మృతి చెందారు. వీరిలో పండిట్ సామాజిక వర్గానికి చెందిన వారితో పాటు ఇతర వర్గాల వారూ ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారులు, టీచర్లు, సర్పంచ్‌లు ఇలా కీలకమైన వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు ఉగ్రవాదులు. కుల్గం జిల్లాలో ఓ బ్యాంక్ అధికారిని హత్య చేసిన దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డ్ అవటం వల్ల ఒక్కసారిగా స్థానిక ప్రజల్లో భయం రెట్టింపైంది. కశ్మీరీ పండిట్‌ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ ఉద్రిక్తతలు చల్లార్చేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రంగంలోకి దిగారు. ఉన్నతాధికారులతో వరుసగా సమావేశమవుతున్నారు. ఇప్పటికే ఓ దఫా చర్చలు ముగిశాయి.
ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇప్పటికే అమిత్‌షాతో కశ్మీర్‌లోని స్థితిగతులపై చర్చలు జరిపారు. అయితే మరోసారి ఉన్నతాధికారులతో సమావేశం జరపాలని నిర్ణయించారు అమిత్‌షా. అజిత్ దోవల్‌తో పాటు జమ్ము, కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, భాజపా సీనియర్ నేతలు, స్థానిక నాయకులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమావేశంలోనే అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన
ఏర్పాట్లపై సమీక్ష జరపనున్నట్టు తెలుస్తోంది. జమ్ము, కశ్మీర్‌లో ఉగ్ర కదలికలు లేకుండా చూడాలని గతంలోనే అమిత్‌షా అక్కడి భద్రతా అధికారులకు సూచించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలన్న ప్రధాని మోదీ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని స్పష్టం చేశారు. ఇలాంటి తరుణంలో వరుస హత్యలు జరగటం వల్ల అమిత్‌షా వరుస సమావేశాలతో లోయల్ పరిస్థితులు చక్కదిద్దే పనిలో నిమగ్నమయ్యారు.
వరుస హత్యలతో లోయలో అలజడి
కశ్మీర్ లోయపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించటం సహా భద్రతను కట్టుదిట్టం చేయటాన్ని చూసి ఉగ్రవాదులు అసహనానికి గురవుతున్నారని అందుకే ఇలా వరుస హత్యలకు పాల్పడుతున్నారని అంటున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. కొత్తగా ఉగ్రసంస్థల్లో చేరిన వాళ్లే ఈ పనులు చేస్తున్నారని అంచనా వేస్తున్నారు. నిజానికి గతేడాది ఫిబ్రవరి నుంచే లోయలో ఉగ్ర అలజడి మొదలైంది. శ్రీనగర్‌లోని ఓ ధాబా యజమాని కొడుకుని కాల్చి చంపారు ఉగ్రవాదులు. తరవాత అక్టోబర్‌లో ప్రముఖ కెమిస్ట్ ఎమ్‌ఎల్ బింద్రూని ఆయన షాప్‌లోనే కాల్చి చంపారు. తరవాత పలువురు టీచర్లనీ ఇలాగే హతమార్చారు ముష్కరులు. కశ్మీరీ టీవీ నటిని కూడా ఇదే విధంగా కాల్చి చంపారు. ఈ వరుస హత్యలతో మరోసారి కశ్మీర్ లోయలో అలజడి రేగింది. వీలైనంత త్వరగా ప్రజల్లో భయాందోళనలు తగ్గించి భరోసా కల్పించాలని భావిస్తోంది కేంద్రం.