Karnataka Election 2023: ప్రధాని ప్రచారాలతో ప్రజలు విసిగిపోయారు, జైరాం రమేశ్ సెటైర్లు
Karnataka Election 2023: ప్రధాని ఎన్ని ప్రచారాలు చేసినా ప్రజలు విసిగిపోయారని, అందుకే బీజేపీ ఓడిపోయిందని జైరాం రమేశ్ సెటైర్లు వేశారు.
Karnataka Election 2023:
జైరాం రమేశ్ కామెంట్స్..
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ప్రధాని నరేంద్ర మోదీపై సెటైర్లు వేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన...ఈ సారి మోదీ మేజిక్ పని చేయలేదని అన్నారు. ఆయన ప్రచారాలూ బీజేపీని కాపాడలేకపోయాయని తేల్చి చెప్పారు. ప్రజలంతా ఆయన ప్రచార ఆర్భాటంతో విసుగు చెందారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో బజ్రంగ్ దళ్ వివాదంపైనా క్లారిటీ ఇచ్చారు.
"ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారాలతో ప్రజలు విసిగిపోయారు. ఎన్ని ర్యాలీలు, రోడ్‌షోలు చేసినా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక బజ్రంగ్ దళ్ విషయానికొస్తే..బజ్రంగ్ దళ్ వేరు బజ్రంగ్ బలి నినాదం వేరు. బజ్రంగ్ దళ్ విద్వేషాలు వ్యాప్తి చేస్తోందన్నది మా ఉద్దేశం. కొన్ని చోట్ల హింసకూ పాల్పడుతోంది. ఇలాంటి మతపరమైన హింసకు పాల్పడే సంస్థల్ని, చట్టాల్ని ఉల్లంఘించే వాళ్లను శిక్షిస్తామన్నదే మా మేనిఫెస్టోలో చెప్పిన అంశం. రాజ్యాంగం ప్రకారమే చర్యలు తీసుకుంటామని చెప్పాం"
- జైరాం రమేశ్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ
#WATCH| Bengaluru: ..."People are tired of PM & his campaign, no matter how many roadshows he did...but people were not enthusiastic...": Jairam Ramesh, Congress General Secretary in-charge Communications#KarnatakaElections2023 pic.twitter.com/PNWrzPV50S
— ANI (@ANI) May 14, 2023
కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. సంబరాలు చేసుకుంటోంది. అటు బీజేపీ మాత్రం ఎందుకిలా జరిగింది అని అనలైజేషన్ మొదలు పెట్టింది. హైకమాండ్ కూడా అలెర్ట్ అయ్యింది. ఓటమికి కారణాలు వెతుక్కుంటోంది. ఈ క్రమంలోనే అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఈ ఫలితాలపై స్పందించారు. ఓటమిని అంగీకరిస్తూ ట్వీట్ చేశారు. EVMలపై తప్పు తోసేయకుండా ఆత్మపరిశీలన చేసుకుంటామని చెప్పారు. కర్ణాటక ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించిన శర్మ..రాష్ట్రంలో తమకు ప్రజలు మద్దతునివ్వలేదన్న విషయాన్ని తొందరగానే గ్రహించామని స్పష్టం చేశారు. కర్ణాటక సీఎం పదవికి బసవరాజు బొమ్మై రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా లాంటి కీలక వ్యక్తులు వచ్చి ప్రచారం చేసినా..బీజేపీకి పరాభవం తప్పలేదు. 136 సీట్లతో కాంగ్రెస్ భారీ మెజార్టీ సాధించింది. కింగ్‌మేకర్‌గా మారుతుందనుకున్న జేడీఎస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఎగ్జిట్ పోల్స్ ముందుగానే బీజేపీ ఓటమిని అంచనా వేశాయి. కానీ...బీజేపీ మాత్రం వాటిని కొట్టిపారేసింది. చివరకు...అనుకున్నదే అయింది.
"ప్రజాతీర్పుని మేమెప్పుడైనా గౌరవిస్తాం. ఓటమినైనా సరే స్వీకరిస్తాం. మా ఓటమికి EVMలే కారణమని బ్లేమ్ చేయం. ఇంకెవరో మమ్మల్ని ఓడించారనీ నిందలు వేయం. అందుకు బదులుగా ఎందుకు ఓడిపోయామో ఆత్మపరిశీలన చేసుకుంటాం. బీజేపీ కర్ణాటక ఈ ఓటమిని అంగీకరిస్తుందని భావిస్తున్నాను. అయినా సరే కర్ణాటక ప్రజలకు సేవలందించేందుకు ఎప్పుడూ ముందుండాలని కోరుకుంటున్నా"
- హిమంత బిశ్వ శర్మ, అసోం సీఎం
Also Read: సిద్దరామయ్యతో ఎలాంటి విభేదాల్లేవు, పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశా - డీకే శివకుమార్ క్లారిటీ