ISRO: ఇస్రో వద్ద ఏ దేశమూ తీయని అద్భుతమైన చంద్రుడి ఫోటోలు, త్వరలోనే విడుదల చేస్తాం: ఇస్రో ఛైర్మన్
ISRO: ఇస్రో వద్ద చంద్రుని అద్బుతమైన ఫోటోలు ఉన్నట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అన్నారు.
ISRO: చంద్రుడికి సంబంధించి ఇస్రో అత్యద్భుతమైన ఫోటోలు ఉన్నాయని, ఇప్పటి వరకు ఏ దేశం వద్ద లేని అద్భుతమైన ఫోటోలు ఉన్నాయని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. ఆదివారం తిరువనంతపురంలో ఉన్న భద్రకాళి ఆలయాన్ని సోమనాథ్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఇస్రో ఛైర్మన్.. జాబిలి ఫోటోలను భారత అంతరిక్షణ పరిశోధన సంస్థకు చెందిన కంప్యూటర్ కేంద్రానికి వెళ్తున్నాయని ఆయన వెల్లడించారు. శాస్త్రవేత్తలు వాటిని ప్రాసెస్ చేస్తున్నారని చెప్పారు. ఆ ఫోటోల ప్రాసెసింగ్ అయిపోగానే త్వరలోనే వాటిని విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. చంద్రయాన్- 3 మిషన్ లో భాగంగా చంద్రుడిపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్.. చాలా సమర్థవంతంగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే 10 రోజుల్లో ల్యాండర్, రోవర్ లు అన్ని పరిశోధనలను పూర్తి చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని పరిశోధనల్లో భాగంగా ప్రజ్ఞాన్ రోవర్ కచ్చితంగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. చంద్రుడితో పాటు అంగారక, శుక్ర గ్రహాల వద్దకు వ్యోమనౌకలను పంపే సత్తా భారత్ కు ఉందని సోమనాథ్ స్పష్టం చేసారు.
నిన్నటికి నిన్న చంద్రుడి ఉష్ణోగ్రతపై మరో అప్ డేట్
ఇస్రో చంద్రయాన్ 3 మిషన్‌పై మరో ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చింది. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతలకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. ఇక్కడి విక్రమ్ ల్యాండర్‌కి అనుసంధానించిన Chandra’s Surface Thermophysical Experiment (ChaSTE) పేలోడ్ అక్కడి ఉష్ణోగ్రతలను రికార్డ్ చేసింది. చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై ఉష్ణోగ్రతల వివరాలు తెలిపింది. ఈ సమాచారం ద్వారా అక్కడి థర్మల్ బిహేవియర్‌ని అర్థం చేసుకోవడం శాస్త్రవేత్తలకు సులభతరం కానుంది. ఇదే విషయాన్ని ఇస్రో అధికారికంగా ట్వీట్ చేసింది. ChaSTE పే లోడ్ కంట్రోల్డ్ పెనట్రేషన్ మెకానిజంతో పని చేస్తుంది. చంద్రుడి ఉపరితలంపై దాదాపు 10 సెంటీమీటర్ల లోతు వరకూ వెళ్లగలిగే కెపాసిటీ ఉంటుంది. దీనికి దాదాపు 10 టెంపరేచర్ సెన్సార్లు అనుసంధానించారు. ఈ సెన్సార్లే అక్కడి ఉష్ణోగ్రతల వివరాలను అందిస్తాయి. ఉపరితలంపై ఒక్కో చోట ఒక్కో విధమైన ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఇస్రో ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఓ మ్యాప్‌ని కూడా షేర్ చేసింది. లూనార్ సౌత్ పోల్ నుంచి ఇలాంటి ప్రొఫైల్ రావడం ఇదే తొలిసారి. ప్రస్తుతానికి అందిన సమాచారాన్ని వెల్లడించిన ఇస్రో...పూర్తి వివరాలను త్వరలోనే చెబుతామని తెలిపింది.
చంద్రయాన్-3 మిషన్ లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ప్రజ్ఞాన్ రోవర్ పరిశోధనలు సాగిస్తోంది. ఈ మేరకు విక్రమ్ ల్యాండర్ కు ఎప్పటికప్పుడు తన పరిశోధన ఫలితాలను పంపిస్తోంది. అక్కడి నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు డేటాను సేకరిస్తున్నారు. ఈ వీడియోలను ఎప్పటికప్పుడు ఇస్రో తన ట్విట్టర్ ఖాతా ద్వారా సోషల్ మీడియా యూజర్లతో పంచుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా మరో వీడియోను షేర్ చేసింది ఇస్రో. చంద్రుని ఉపరితలంపై తిరగాడుతున్న ప్రజ్ఞాన్ రోవర్.. తన పరిశోధనా విధుల్లో భాగంగా చక్కర్లు కొడుతోంది. ఇటీవలే రోవర్ శివశక్తి పాయింట్ వద్ద తిరగాడుతున్న దృశ్యాలు ఇస్రో షేర్ చేసిన వీడియోలో చూడవచ్చు.