ఇజ్రాయేల్-హమాస్ యుద్ధంపై ప్రధాని మోదీ ఫైర్, ప్రాణాలు తీస్తున్నారంటూ అసహనం
Israel Gaza Attack: ఇజ్రాయేల్, హమాస్ యుద్ధంపై ప్రధాని మోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Israel Gaza War:
ఇజ్రాయేల్ హమాస్ యుద్ధం..
ఇజ్రాయేల్, హమాస్ యుద్ధంపై (Israel Hamas War) ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పందించారు. వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులను ఖండించారు. Global South Summitలో మాట్లాడిన ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో కొత్త సవాళ్లు ఎదుర్కొంటున్నామని, ఈ ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు భారత్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు. దౌత్యం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చని సూచించారు. హింసని, ఉగ్రవాదాన్ని భారత్ ఎప్పుడూ వ్యతిరేకిస్తుందని వెల్లడించారు. ఈ యుద్ధాన్ని కట్టడి చేసే విషయంలో Global South దేశాలన్నీ ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ.
"పశ్చిమాసియా ప్రాంతంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. అక్టోబర్ 7న ఇజ్రాయేల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంతో మంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు భారత్ ఎంతగానో ప్రయత్నిస్తోంది. చర్చలు, దౌత్యం ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకోవచ్చు. అమాయక ప్రజల ప్రాణాల్ని తీయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పాలస్తీనా అధ్యక్షుడు మహమౌద్ అబ్బాస్‌తో ఇప్పటికే మాట్లాడాను. పాలస్తీనా ప్రజలకు అవసరమైన మానవతా సాయం అందించాం. భారత్‌తో పాటు అన్ని దేశాలూ ఒక్కటై అక్కడి ప్రజలకు అండగా నిలబడాల్సిన అవసరముంది"
- ప్రధాని నరేంద్ర మోదీ
అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌పై దాడులు మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఇజ్రాయేల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఈ యుద్ధంలో 1,200 మంది ఇజ్రాయేల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అటు గాజాలోనూ వేలాది మంది బలి అయ్యారు. ఇజ్రాయేల్ దాడుల కారణంగా పాలస్తీనాలో 11 వేల మంది మృతి చెందినట్టు అక్కడి మీడియా చెబుతోంది.