Gaza: గాజాపై డంబ్ బాంబ్స్‌తో ఇజ్రాయేల్ దాడులు, అవి ఎంత ప్రమాదకరమో తెలుసా?
Israel Gaza Attack: గాజాపై ఇజ్రాయేల్ డంబ్ బాంబ్స్‌తో దాడులు చేయడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Israel Palestine Attack:
గాజాపై దాడులు..
గాజాపై ఎయిర్ స్ట్రైక్‌ల తీవ్రతను (Israel Hamas War) అంతకంతకూ పెంచుతోంది ఇజ్రాయేల్ సైన్యం. ఇప్పటికే గాజా (Attack on Gaza) పూర్తిగా ధ్వంసమైంది. బిల్డింగ్‌లు నేలమట్టమయ్యాయి. వేలాది మంది ప్రజలు అక్కడి నుంచి వలస వెళ్లిపోతున్నారు. అక్టోబర్ 7న హమాస్ దాడులతో మొదలైన ఈ విధ్వంసం ఇంకా కొనసాగుతోంది. అయితే...హమాస్‌ని అంతం చేయడానికి ఇజ్రాయేల్ "Dumb Bombs"ని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నట్టు అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. అమెరికా చెందిన Director of National Intelligence ఆఫీస్ ఈ రిపోర్ట్‌ని విడుదల చేసింది. CNN వెల్లడించిన వివరాల ప్రకారం...ఇజ్రాయేల్ చేసిన దాడుల్లో 45% మేర ఎయిర్ స్ట్రైక్స్ ఉన్నాయి. ఇందుకోసం దాదాపు 29 వేల ఆయుధాలను వినియోగించింది. అయితే..ఈ దాడుల తీవ్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారీ మొత్తంలో ప్రాణనష్టం నమోదయ్యే ప్రమాదముందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. జనసాంద్రత ఎక్కువగా ఉండే గాజాపై ఇలాంటి దాడులు చేయడం వల్ల ఎక్కువ మంది పౌరులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికా అసహనం..
ఇజ్రాయేల్ గాజాపై విచక్షణా రహితంగా దాడులు చేస్తోందని అన్నారు. ఈ ఆరోపణలపై ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ (Israel Defence Forces) ప్రతినిధులు స్పందించారు. అంతర్జాతీయ చట్టాల నిబంధనల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని తేల్చి చెప్పారు. పౌరులకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అయితే..ఎక్స్‌పర్ట్స్ మాత్రం ఇజ్రాయేల్ తీరుపై మండి పడుతున్నారు. పైకి చెప్పేది ఒకటి..చేసేది ఒకటి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే స్థాయిలో ఎయిర్‌స్ట్రైక్స్ కొనసాగితే మృతుల సంఖ్య భారీగా పెరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. నిజానికి అమెరికా, ఇజ్రాయేల్ మధ్య మైత్రి బాగానే ఉంది. ఈ యుద్ధానికి అమెరికా ఇజ్రాయేల్‌కి మద్దతునిచ్చింది కూడా. కానీ అదే సమయంలో విచక్షణా రహితంగా వ్యవహరించడంపై కాస్త గుర్రుగా ఉంది.