Iran Hijab Protest: హిజాబ్ చట్టాన్ని రివ్యూ చేస్తున్నాం, త్వరలోనే మార్పులు - ఇరాన్ అటార్నీ జనరల్
Iran Hijab Protest: ఇరాన్‌లోని హిజాబ్ చట్టాన్ని ప్రభుత్వం రివ్యూ చేస్తున్నట్టు అటార్నీ జనరల్ వెల్లడించారు.
Iran Hijab Protest:
రెండు వారాల్లో ప్రకటన..?
ఇరాన్‌లో కొద్ది నెలలుగా హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని మహిళలు రోడ్లపైకి వచ్చి హిజాబ్‌లు గాల్లోకి విసిరేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిజాబ్‌లు కాల్చేస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పోలీసులు, నిరసనకారుల మధ్య జరుగుతున్న ఘర్షణలు కొందరు ప్రాణాలూ కోల్పోతున్నారు. అంతర్జాతీయంగా ఇరాన్ మహిళలకు మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే...ఇరాన్ అటార్నీ జనరల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కఠినతరమైన ఇరాన్ ప్రభుత్వం హిజాబ్ చట్టాన్ని రివ్యూ (Hijab Law Review) చేస్తున్నట్టు వెల్లడించారు. దశాబ్దాల క్రితం తయారు చేసిన చట్టాన్నే ఇప్పుడు అమలు చేయడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. మూడు నెలలుగా ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో...చట్టంలో మార్పులు చేర్పులు తప్పవని భావిస్తోంది ప్రభుత్వం. ఐక్యరాజ్య సమితి వెల్లడించిన లెక్కల ప్రకారం...ఇప్పటి వరకూ ఈ నిరసనల్లో 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే తీరులో ఉద్యమం కొనసాగితే...మరింత ప్రాణనష్టం సంభవించే ప్రమాదం లేకపోలేదు. "పార్లమెంట్‌తో పాటు న్యాయవ్యవస్థ కూడా హిజాబ్ చట్టాన్ని రివ్యూ చేస్తున్నాయి. ఇందులో ఏమైనా మార్పులు చేయొచ్చా అనే దిశగా ఆలోచిస్తున్నాయి" అని ఇరాన్ అటార్నీ జనరల్ మహమ్మద్ జాఫర్ మొంటజెరి వెల్లడించారు. అయితే...ఎలాంటి మార్పులు చేస్తారన్న విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ రివ్యూ టీంని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇటీవలే...పార్లమెంట్ కల్చరల్ కమిషన్‌తో ఈ బృందం సంప్రదింపులు జరిపింది. వారం లేదా రెండు వారాల్లో ఈ మార్పులపై స్పష్టత వచ్చే అవకాశముందని అటార్నీ జనరల్ తెలిపారు.
పెరుగుతున్న మృతుల సంఖ్య..
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇటీవల పార్లమెంట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. "ప్రపంచంలోనే అత్యంత గొప్పనైన, విలువైన రాజ్యాంగం ఇరాన్‌కు ఉంది" అని అన్నారు. అంతే కాదు. ఈ రాజ్యాంగం ఇస్లామిక్ వ్యవస్థను గౌరవిస్తుందని, ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తుందని తేల్చి చెప్పారు. అటు ఆందోళనలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ చనిపోయిన వారి సంఖ్య 300 మంది అని చెబుతున్నా...
అంత కన్నా ఎక్కువే ఉంటాయని కొన్ని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. 469 మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో 64 మంది మైనర్లు ఉన్నారని అంటున్నాయి. ఇప్పటి వరకూ 18,210 మందిని అరెస్ట్ చేశారు. హిజాబ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా అమెరికా ఇరాన్‌కు సపోర్ట్ ఇస్తోంది. అమెరికాలోని పౌరులు కూడా వారికి అండగా నిలిచారు. లాస్ ఏంజిల్స్, వాషింగ్టన్ డీసీలో వేలాది మంది రోడ్లపైకి వచ్చిఇరాన్ మహిళలకు మద్దతుగా నిలిచారు. "మేమంతా ఒక్కటవుతున్నాం. ఇక మీరు భయపడాల్సిందే" అంటూ ఇరాన్‌ను హెచ్చరిస్తూ నినాదాలు చేశారు. హిజాబ్‌పై పోరాడి పోలీస్‌ల కస్టడీలో మృతి చెందిన మహసా పేరునీ గట్టిగా పలుకుతూ నినదించారు. కొన్ని సంస్థలు ప్రత్యేక చొరవ చూపించి ఇలా ప్రజల్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు.
Also Read: Bill Gates Dance Video: మైక్రోసాప్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ డాన్స్ వీడియో చూశారా, మిలియన్ల వ్యూస్