International Tigers Day 2021: 'ది రాయల్ బెంగాల్ టైగర్'.. దీని రాజసమే వేరప్పా!
నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం. 1913లో ప్రపంచంలో లక్ష పులులు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 3900 లోపే ఉంది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే పులుల గురించి కొన్ని షాకింగ్ విషయాలు చూద్దామా!
భారతదేశ జాతీయ జంతువైన పులి... రాచఠీవికి పెట్టింది పేరు. పులి ఎప్పుడూ శత్రువు ముందు తల వంచదు. దాని అడుగులు ముందుకే పడతాయి తప్ప వెనక్కి వెళ్లవు. ప్రాణాలను పులి లెక్కచెయ్యదు. అందుకే అడవిలో పులి స్థానం సుస్థిరం.
పిల్లలు 'జూ'కి వెళ్లినప్పుడు ఏ జంతువును చూసినా ఆనందపడతారు. పులిని చూస్తే మాత్రం షాక్ అవుతారు. ఆ గంభీరమైన చూపులు, నల్లటి చారలు, రాచ ఠీవీ ఒలకబోస్తూ అటూ ఇటూ పులి తిరుగుతుంటే అందరూ దాన్ని చూసి... ఎలా ఉందో చూడు అనుకుంటుంటే... అది చూసి పిల్లలు థ్రిల్ ఫీలవుతారు. అంతరించే జంతువుల జాబితాలో ఉన్న పులులను కాపాడే బాధ్యత మనందరిదీ. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ (WWF) లెక్కల ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నది 3900 పులులే. వాటిలో 70 శాతం మన ఇండియాలోనే ఉన్నాయి. మంచి విషయమేంటంటే... ఇండియా, నేపాల్, చైనా, భూటాన్, రష్యాలో... పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయినప్పటికీ వాటి సంఖ్య చాలా తక్కువే.
పులులపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు ప్రతి సంవత్సరం జులై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం జరుపుతున్నారు. ఈ సందర్భంగా పులులకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
- పులులు పుట్టాక ఎక్కువ కాలం తమ తల్లిదండ్రులపై ఆధారపడవు. తమ కాళ్లపై తాము నిలబడటానికి ఇష్టపడతాయి. రెండేళ్లు కాగానే విడిగా వెళ్లిపోతాయి. మగ పులులకు మూడేళ్ల తర్వాత సెక్సువల్ మెచ్చూరిటీ వస్తుంది. ఆడ పులులకు నాలుగేళ్ల తర్వాత వస్తుంది.
- పులులు 20 ఏళ్ల దాకా బతుకుతాయి. షాకింగ్ విషయమేంటంటే... పులి పిల్లలు పుట్టినప్పుడు వాటికి కళ్లు కనపడవు. తమ తల్లు నుంచి వచ్చే వాసనను బట్టీ తల్లిని ఫాలో అవుతాయి.
- పులి పిల్లల్లో సగం ఆకలితో చనిపోతాయి. లేదా చలికి తట్టుకోలేక చనిపోతాయి. పుట్టిన రెండేళ్లలో ఇలా చాలా పిల్లలు చనిపోతాయి. WWF ప్రకారం చాలా పులులు పిల్లలుగా ఉన్నప్పుడే చనిపోతున్నాయి.
- ప్రతీ పులికీ చారలు వేర్వేరుగా ఉంటాయి. మనుషుల్లో ఏ ఇద్దరికీ ఒకేలాంటి వేలి ముద్రలు ఉండనట్లే... ఏ రెండు పులులకూ ఒకేరకమైన చారలు ఉండవు.
- పులి ఉమ్మిలో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. అందుకే పులులకు గాయాలైనప్పుడు అవి తమ నాలికతో గాయాన్ని రుద్దుకుంటాయి. ఆ లాలాజలం గాయాన్ని మాన్పిస్తుంది.
- టైగర్లు బాగా ఈదగలవు. ఆహారం కోసం చాలా దూరం ఈదుతూ వెళ్లగలవు. బెంగాల్ సుందర్‌బన్స్ అడవుల్లో చాలా పులులు ఈదుతూ వెళ్లడాన్ని టూరిస్టులు చూస్తూ ఉంటారు. పైగా పులులకు నీటిలో ఆడుకోవడం చాలా ఇష్టం.
- సింహాలు గుంపులుగా జీవిస్తాయి. పులులు విడివిడిగా జీవిస్తాయి. ప్రతీ పులి తనకంటూ భారీ ప్రాంతాన్ని ఎంచుకుంటుంది. యూరిన్ పోయడం, మూత్ర విసర్జన చేయడం, అరవడం ద్వారా పులులు తమ ఏరియాను డిసైడ్ చేస్తాయి. అందులోకి మరో పులిని రానివ్వవు.
- పులుల పాదాల కింద మెత్తగా ఉంటుంది. అందువల్ల అవి నడిచేటప్పడు సౌండ్ రాదు. ఫలితంగా అవి వేటాడేటప్పుడు సైలెంట్‌గా వచ్చి ఉరుకుతాయి. పులులు గంటకు 65 కిలోమీటర్ల వేగంతో పరుగెడతాయి.
- రాత్రిళ్లు మనుషుల కంటే పులులు ఆరు రెట్లు బాగా చూడగలవు. పులులు పగటి వేళ కంటే రాత్రివేళ బాగా వేటాడగలవు. అలాగని అవి పగటివేళ వేటను మిస్ చెయ్యవు.
- పులులకు ముందు కాళ్ల కంటే వెనక కాళ్లు ఎక్కువ పొడవుగా ఉంటాయి. ఫలితంగా అవి ఒక్కో జంప్ కు ఎక్కువ దూరం గెంతగలవు. అలా గెంతుతున్నప్పుడు వాటికి ఉండే పొడవైన తోకతో అవి బ్యాలెన్స్ చేసుకుంటూ అటూ ఇటూ మలుపులు తిరగగలవు.
- బాగా పెరిగిన పులి 140 కేజీల నుంచి 300 కేజీల దాకా ఉంటుంది. ఆడపులి ఒకేసారి 35 కేజీల ఆహారాన్ని తినగలదు.
బెంగాల్ టైగర్..
ది రాయల్ బెంగాల్ టైగర్.. పులుల్లో దీని లెక్కే వేరు!.. అసలు దాని ఠీవీ.. నడకలో రాజసం.. చూపుల్లో పవర్.. ఇక ఏ పులిలోనూ కనబడదు. అయితే ఈ బెంగాల్ టైగర్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? వాటి విశేషాలు ఏంటి? చూద్దామా
- ఈ బెంగాల్ టైగర్స్ ఎక్కువగా భారత్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ లో కనిపిస్తుంటాయి.
- ఇవి చాలా బలంగా, పుష్టిగా ఉంటాయి. సాధారణంగా ఆరెంజ్, నలుపు రంగు చారలతో ఇవి ఉంటాయి. వీటితో వేట, ఆట చాలా ప్రమాదకరం.
- ఈ బెంగాల్ టైగర్స్ ఒకేసారి 40 కేజీల మాంసాన్ని తినగలవు. తినగా మిగిలిన ఆహారాన్ని ఇవి భూమిలో దాస్తాయి.. మళ్లీ కొన్ని రోజుల తర్వాత వచ్చి ఆ ఆహారాన్ని తింటాయి.
- ప్రస్తుతం ఉన్న ఆరు పులి జాతుల్లో వీటి ప్రత్యేకతే వేరు. ఇవి మూడు మీటర్ల (10 అడుగుల) పొడవు. 225 కేజీల బరువు ఉంటాయి.
- బెంగాల్ టైగర్.. భారత్, బంగ్లాదేశ్ దేశాల జాతీయ జంతువు.
- ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల సంఖ్యలో సగానికిపైగా ఉన్నది బెంగాల్ టైగర్‌లే.
- ఈ బెంగాల్ టైగర్ గాండ్రిస్తే ఆ అరుపు దాదాపు 3.2 కిమీ వరకు వినిపిస్తుంది.