Women's Reservation Bill 2023: మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం, అనుకూలంగా 454, వ్యతిరేకంగా 2 ఓట్లు
ఈ బిల్లుకు అనుకూలంగా 454 మంది లోక్ సభ సభ్యులు ఓటు వేయగా, ఇద్దరు ‘నో’ అని ఓట్ చేసినట్లుగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
Women's Reservation Bill 2023: మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లుకు అనుకూలంగా 454 మంది లోక్ సభ సభ్యులు ఓటు వేయగా, ఇద్దరు ‘నో’ అని ఓట్ చేసినట్లుగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. కొత్త పార్లమెంటు భవనంలో ప్రవేశపెట్టిన తొలి బిల్లు, పాసైన తొలి బిల్లు ఇదే కావడం విశేషం. పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలు లాంటి చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లుకు సుమారు 27 ఏళ్ల తర్వాత మోక్షం లభించింది. కానీ, డీలిమిటేషన్ తర్వాతే మహిళలకు రిజర్వేషన్ కోటా అమలుకానుంది. దీంతో లోక్‌సభలో మహిళల సీట్ల సంఖ్య 181కు పెరగనుంది.
నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సెప్టెంబర్ 19న ప్రవేశపెట్టింది. బుధవారం (సెప్టెంబర్ 20) దీనిపై లోక్ సభలో చర్చ జరిగింది. దాదాపు 8 గంటలపాటు చర్చ జరిగిన అనంతరం.. న్యాయశాఖ మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం మ్యాన్యువల్ ఓటింగ్ నిర్వహించారు.
బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం స్లిప్పుల ద్వారా సభలో ఓటింగ్ నిర్వహించారు. అంతకుముందు బిల్లు అసంపూర్తిగా ఉందని విపక్షాలు లోక్ సభ నుంచి బయటకు వెళ్లిపోయాయి. ఆ తర్వాత స్లిప్పుల ద్వారా ఓటింగ్ ప్రారంభం అయింది. డిజిటల్ ఓటింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్య ఉండడంతో ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పుల ద్వారా ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్ సమయంలో సభలో 456 మంది ఉన్నారు.
ఓటింగ్ పద్ధతిని లోక్ సభ సెక్రటరీ ఉత్పల్ కుమార్ సింగ్ వివరించారు. ఆకుపచ్చ, ఎరుపు రంగు స్లిప్పులపై ఎస్, నో అని రాయాలని, దానిపై సభ్యుడు సంతకం చేసి, వారి పేరు, ఐడీ నెంబర్, నియోజకవర్గం, రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం పేరు, తేదీ వంటి వివరాలు రాయాలని లోక్ సభ సెక్రటరీ ఉత్పల్ కుమార్ సింగ్ ముందే సూచించారు. లోక్ సభ అధికారులు సభ్యుల సీట్ల వద్దకు వచ్చి అందరికీ స్లిప్పులు పంపిణీ చేస్తారని, మళ్లీ ఆ స్లిప్పులను తీసుకొనే వరకూ ఎవరూ తమ సీట్లు వదిలి వెళ్లవద్దని సూచించారు.
వ్యతిరేకంగా ఓటు వేసిన ఇద్దరు వీరే
మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇద్దరు వ్యతిరేకంగా ఓటు వేశారు. వారిలో ఒకరు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఔరంగాబాద్ ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ ఉన్నారు.
రేపు (సెప్టెంబరు 21) రాజ్యసభకు బిల్లు
లోక్ సభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు రేపు (సెప్టెంబరు 21)న రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. విపక్షాలు కూడా ఈ బిల్లుకు మద్దతు తెలుపుతుండటంతో అక్కడ కూడా ఇది ఆమోదం పొందడం సునాయసం కానుంది. దీంతో సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న ఈ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందితే.. 30 ఏళ్ల ప్రయత్నం ఫలించినట్లు అవుతుంది. 2008లో యూపీఏ - 1 హాయాంలో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత లోక్ సభలో ప్రవేశపెట్టడానికి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో ఈ బిల్లును తాజాగా మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.