Justice Varma Impeachment: న్యాయమూర్తుల అభిశంసన ప్రక్రియ ఎలా జరుగుతుంది? జస్టిస్ వర్మ కేసును లోతుగా తెలుసుకోండి!
Justice Varma Impeachment: భారత్‌లో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానమే అభిశంసన. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124లో అభిశంసన వంటి అంశాలు ప్రస్తావిస్తుంది.

Justice Varma Impeachment: భారతదేశ ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ అత్యంత కీలకమైనది. రాజ్యాంగ పరిరక్షణకు మూలవిరాట్ న్యాయవ్యవస్థే. అయితే, ఈ వ్యవస్థలో భాగమైన న్యాయమూర్తులను తొలగించడం అనేది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. న్యాయమూర్తుల తొలగింపు ఎలా చేయాలన్న విషయాన్ని రాజ్యాంగం ప్రత్యేకంగా పొందుపరిచింది. న్యాయమూర్తులను తొలగించే ప్రక్రియను అభిశంసన (Impeachment) అంటారు. ఈ విధానం ద్వారానే న్యాయమూర్తులను తొలగిస్తారు. ప్రస్తుతం జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన ప్రక్రియ సాగుతోంది. ఇది ఎలా జరుగుతుంది? అభిశంసనపై రాజ్యాంగం ఏం చెబుతోంది? అన్న విషయాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
అభిశంసన ఏ స్థాయి న్యాయమూర్తులకు వర్తిస్తుంది?
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానమే అభిశంసన. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు ఏర్పాటు, నిర్వహణ, న్యాయమూర్తుల ఎంపిక, అభిశంసన వంటి అంశాలను ప్రస్తావిస్తుంది. ఆర్టికల్ 124(4) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు అంశాన్ని వివరిస్తుంది. ఇక, ఆర్టికల్ 217, 218 హైకోర్టు న్యాయమూర్తుల అభిశంసన ప్రక్రియను వివరిస్తుంది.
న్యాయమూర్తుల అభిశంసనకు గల కారణాలు ఇవే
రాజ్యాంగంలో నిర్దేశించిన ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను రెండు కారణాల మీద మాత్రమే అభిశంసన చేసే అవకాశం ఉంది. అందులో మొదటి కారణం దుష్ప్రవర్తన (Misbehaviour), రెండో కారణం అసమర్థత (Incapacity). ఈ రెండు కారణాలే అభిశంసన ప్రక్రియకు ప్రాతిపదిక.
అభిశంసన ప్రక్రియ జరిగే విధానం
పై రెండు కారణాలతో న్యాయమూర్తులపై అభిశంసన ప్రక్రియ "న్యాయమూర్తుల విచారణ చట్టం, 1968" (Judges Enquiry Act, 1968) ద్వారా చేపడతారు. ఇందులో ఐదు దశలు ఉంటాయి. న్యాయమూర్తుల తొలగింపు అధికారంలోని ఆ దశలు క్రింది విధంగా ఉంటాయి:
1. ఉభయ సభల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం: న్యాయమూర్తుల తొలగింపునకు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటే లోక్‌సభలో కనీసం 100 మంది సభ్యులు, రాజ్యసభలో ప్రవేశపెట్టదలచుకుంటే 50 మంది సభ్యులు సంతకాలు అవసరం. అలా సంతకాలు చేసిన తీర్మానాన్ని లోక్‌సభలో అయితే స్పీకర్‌కు, రాజ్యసభలో అయితే ఛైర్మన్‌కు సమర్పించాల్సి ఉంటుంది.
2. అభిశంసన తీర్మానంపై విచారణ కమిటీ ఏర్పాటు: అభిశంసన తీర్మానాన్ని లోక్‌సభలో స్పీకర్, రాజ్యసభలో ఛైర్మన్ ఆమోదించిన తర్వాత ముగ్గురు సభ్యులతో విచారణకు కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి, ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, వారితోపాటు ఒక న్యాయ నిపుణుడు సభ్యులుగా ఉంటారు.
3. ఆరోపణలపై కమిటీ విచారణ- నివేదిక: న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానంలో వచ్చిన ఆరోపణలను ఈ త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతుంది. న్యాయమూర్తిపై ఆరోపణలు రుజువైతే, ఆ అంశాలతో కూడిన నివేదికను పార్లమెంట్‌కు ఈ విచారణ కమిటీ సమర్పిస్తుంది.
4. కమిటీ నివేదికపై పార్లమెంట్‌లో ఓటింగ్: పార్లమెంట్‌కు సమర్పించిన త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా అభిశంసన తీర్మానంపై ఓటింగ్ జరుగుతుంది. ఈ తీర్మానం ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లోనూ ప్రత్యేక మెజారిటీ అవసరం. అంటే, సభలోని మొత్తం సభ్యులలో మెజారిటీతోపాటు, ఆ రోజు సభకు హాజరై ఓటు వేసిన సభ్యులలో మూడింట రెండు వంతుల మెజారిటీ సభ్యులు ఆ తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది.
5. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తొలగింపు: ఉభయ సభల్లోనూ అభిశంసన తీర్మానం ఆమోదం పొందిన తర్వాత దాన్ని రాష్ట్రపతికి పంపుతారు. రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత ఆరోపణలు రుజువైన న్యాయమూర్తిని పదవి నుంచి తొలగిస్తారు.
ఈ ఐదు దశలు దాటిన తర్వాతే అభిశంసన ఎదుర్కొన్న న్యాయమూర్తులను తొలగిస్తారు. ఓ రకంగా చెప్పాలంటే, న్యాయమూర్తిని తొలగించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ ప్రక్రియ చాలా కఠినమైనది, సంక్లిష్టమైనది. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి అభిశంసన ప్రక్రియ ద్వారా న్యాయమూర్తులు తొలగించడం జరగలేదు.






















