Wedding called off: వరుడి విగ్గు ఊడింది, పెళ్లి ఆగింది
దాదాపు పెళ్లి పనులన్నీ పూర్తయ్యాయి. పెళ్లికి ముందు జరగాల్సిన తంతు కూడా పూర్తైంది. పెళ్లి మండపంపైకి వెళ్లి తాళి కడితే చాలు వివాహం పూర్తయ్యేది. కానీ ఇంతలోనే జరగాల్సింది జరిగిపోయింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగిన విచిత్ర సంఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. ఉన్నావ్‌కు చెందిన యువకుడితో సమీప గ్రామంలోనే యువతితో పెళ్లి కుదిర్చారు పెద్దలు. కొన్ని రోజులుగా పెళ్లికి సంబంధించిన ప్రక్రియనూ రెండు కుటుంబాల వాళ్లు పూర్తి చేశారు. బంధువులందర్నీ పిలిచారు. పిలిచిన వారంతా వచ్చారు.
ఆదివారం పెళ్లికి అంతా రెడీ అయ్యారు. తాళి కట్టే ముందు జరగాల్సిన తంతు మొత్తం పూర్తైంది. వధువు, వరులు ఇద్దరూ మండపం పైకి వెళ్తున్నారు. సడెన్‌గా కిందపడిపోయాడు వరుడు. ఏం జరిగిందో అని అంతా షాక్. అక్కడి వాళ్లు ఆయన మొహంపై నీళ్లు చల్లి లేచి కూర్చోబెట్టారు.
పెళ్లి కొడుకు గెటప్‌లో ఉన్న వరుడు పడిపోవడంతో ఆయన తలపై ఉన్న టోపీ పడింది. టోపీతోపాటు విగ్ కూడా ఊడి కింద పడింది. ఇది చూసిన వధువు ఫ్యూజులు అవుట్ అయ్యాయి. ఆమెతోపాటు తన తరఫు బంధువులంతా దీన్ని చూసి బిత్తరపోయారు.
కాబోయే భర్తకు బట్టతల ఉందని తెలుసుకున్న ఆ వధువు పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. ఈ విషయంలో ముందే చెప్పి ఉంటే బాగుండేదని... దాచి పెట్టి ఇప్పుడు అందరి ముందు పరువు తీశారని బాధ పడింది. అందుకే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసింది. దీంతో విషయం పోలీసులు స్టేషన్ మెట్లు ఎక్కింది.
జోక్యం చేసుకున్న పోలీసులు... రెండు కుటుంబాలను కూర్చోబెట్టి పంచాయితీ సెటిల్ చేశారు. ఎన్ని విధాలుగా చెప్పినా వధువు తరఫున బంధువులు పెళ్లి జరిపేందుకు అంగీకరించలేదు. చేసేది లేక పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ పెళ్లి కోసం ఆరు లక్షల వరకు ఖర్చు చేశామని వధువు తండ్రి పోలీసులు తెలిపారు. వాటిని వరుడి కుటుంబం నుంచి వసూలు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు మాట్లాడి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేలా వరుడి ఫ్యామిలీ మెంబర్స్‌ను ఒప్పించారు.
దీనిపై వధువు తరఫున ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుతూ.. బట్టతల సమస్య కాదని... ముందే చెప్పి ఉంటే తమ అమ్మాయిని మానసికంగా రెడీ చేసే వాళ్లమని.. అందరి ముందు అలా జరగడం బాధగా ఉందన్నారు. ఆ విషయాన్ని దాచి పెట్టడంతోనే సమస్య వచ్చిందన్నారు.
వధువును నచ్చజెప్పేందుకు ప్రయత్నించామని... వాాళ్ల తరఫున ఒక్కరంటే ఒక్కరు కూడా పెళ్లి జరిపేందుకు సిద్ధంగా లేరని... అందుకే పెళ్లిని క్యాన్సిల్ చేసుకోమని వరుడి బంధువులను ఒప్పించామంటున్నారు పోలీసులు.
ఇలా పెళ్లి పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో వరుడి ఫ్యామిలీ షాక్‌కు గురైంది. ఎంత నచ్చజెప్పినా వధువు పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోకపోవడంతో పెళ్లి ఖర్చులు చెల్లించి వెనుదిరిగిందారు.