Priyanka Gandhi: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ, వయనాడ్ ప్రజలను ఉద్దేశించి లేఖ విడుదల
Wayanad ByElections | తనకు ప్రత్యక్ష రాజకీయాలు కొత్త కానీ, పోరాటాలు మాత్రం కొత్త కాదని.. తన సోదరుడు రాహుల్ గాంధీపై చూపిన ప్రేమ, నమ్మకాన్ని తనపై ఉంచాలని ప్రియాంక గాంధీ వయనాడు ప్రజలకు లేఖ రాశారు.

Priyanka Gandhi Vadra | న్యూఢిల్లీ: పదేళ్ల నుంచి ప్రియాంక గాంధీ రాజకీయ ప్రవేశం, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపై ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో త్వరలో ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి ఆమె దిగుతున్నారు. సోదరుడు రాహుల్ గాంధీ ఎంపీ పదవికి రాజీనామా చేసిన వయనాడ్ నుంచి లోక్ సభ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. బుధవారం నాడు నామినేషన్ సైతం వేశారు. ఈ క్రమంలో వయనాడ్ లోక్ సభ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రియాంక ఓ లేఖ రాశారు. తనకు ఎన్నికల్లో పోటీ చేయడం కొత్త కానీ, ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేయడం మాత్రం కొత్త కాదని పేర్కొన్నారు.
ప్రియాంక గాంధీ రాసిన భావోద్వేగ లేఖలో ఏముందంటే..
కొన్ని నెలల కిందట కొండచరియలు విరిగిపడి, ప్రకృతి సృష్టించిన బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన మండక్కై, చూరమల ప్రాంతాలను నా సోదరుడు రాహుల్‌తో కలిసి సందర్శించాను. ప్రకృతి బీభత్సం వల్ల మీరు సర్వస్వం కోల్పోయింది చూశా. మీ కష్టాలను ప్రత్యక్షంగా కలిసి తెలుసుకున్నాను. తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను కలిశాను. పిల్లల్ని కోల్పోయి నరకయాతన అనుభవించిన వారిని స్వయంగా కలిసి వారి బాధలు తెలుసుకున్నారు. ఆ కష్టాలు, చీకటి రోజుల నుంచి మీరు కోలుకున్న తీరు, బాధల్ని దిగమింగుతూ ముందుకు కదిలిన మీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్న. నిస్సహాయ స్థితిలో సహాయం కోసం ఎదురుచూస్తున్న తోటి వారి కోసం మీరు పడిన ఆరాటం మీ మానవత్వాన్ని తెలుపుతుంది. ఆ సమయంలో ఎంతగానో శ్రమించిన వాలంటీర్లు, డాక్టర్లు, ప్రజా ప్రతినిధులు, సోషల్ వర్కర్లు, పౌరులకు నా ప్రశంసలు. ఇలాంటి చోటుకు వచ్చి మీ పార్లమెంట్ స్థానంలో పోటీ చేసే అవకాశం రావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తాను’ అని ప్రియాంక లేఖలో పేర్కొన్నారు.
ఇంతకాలం నా సోదరుడు రాహుల్ గాంధీపై ప్రేమ చూపించారు. ఎంతగానో ఆదరించారు. ఇకనుంచి మీరు అదే ప్రేమను, ఆప్యాయతను నాకు పంచుతారని ఆశిస్తున్నానంటూ ప్రియాంక పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ తనను వయనాడ్ నుంచి పోటీ చేసి ఈ ప్రజలకు సేవ చేయాలని, వీరి తరఫున పార్లమెంట్ లో తన గళం విప్పాలని కోరినట్లు తెలిపారు. ఇక్కడి చిన్నారులు, మహిళలు, గిరిజనులు, యువత అన్ని వర్గాల వారి కోసం అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం తనకు ఇది కొత్త కావచ్చు కానీ, ప్రజల తరఫున గళం విప్పడం, పోరాటాలు చేయడం కొత్తేమీ కాదని వయనాడు ప్రజలకు ప్రియాంక గాంధీ గుర్తు చేశారు. వయనాడులోని సహజ వనరులు, ప్రకృతిని కాపాడుకునేందుకు పార్లమెంట్ సాక్షిగా పోరాటం చేసేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నట్లు ఆమె స్పష్టం చేశారు.
నవంబర్ 13న ఎన్నికలు
లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ సీపీఐ నాయకురాలుపై విజయం సాధించి వరుసగా రెండోసారి వయనాడ్ నుంచి ఎంపీ అయ్యారు. యూపీ నుంచి సైతం పోటీ చేసి నెగ్గడంతో.. చేసేదేమీ లేక వయనాడు స్థానానికి రాజీనామా చేశారు. ఈ స్థానం నుంచి ప్రియాంక బరిలోకి దిగుతున్నారు. నవంబర్ 13న వయనాడు ఎంపీ స్థానంతో పాటు చెలక్కెర, పాలక్కాడ్ అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు ప్రక్రియతో ఫలితాలు తేలనున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

