త్వరలోనే అందుబాటులోకి వందే సాధారణ్ ఎక్స్‌ప్రెస్, వందేభారత్‌కి ఏ మాత్రం తగ్గని సౌకర్యాలు
Vande Sadharan Express: వందే సాధారణ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తైంది.
Vande Sadharan Express:
ట్రయర్ రన్ పూర్తి..
భారత రైల్వేలో సంస్కరణలపై కేంద్రం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఇప్పటికే వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిలోనూ మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగానే వందే సాధారణ్ ఎక్స్‌ప్రెస్‌లను ( Vande Sadharan Express) తయారు చేసింది. వందేభారత్ రైళ్లలాగే ఉన్నా వీటిలో ఏసీ ఉండదు. సింపుల్‌గా చెప్పాలంటే ఇవి నాన్ ఏసీ వందేభారత్ (Vande Bharat Express) ఎక్స్‌ప్రెస్‌లు. వీటిని అందుబాటులోకి తీసుకొచ్చే ముందు ట్రయల్ రన్ నిర్వహించింది ఇండియన్ రైల్వే. అహ్మదాబాద్ నుంచి ముంబయి మధ్యలో ఈ ట్రయల్ రన్ జరిగింది. ఈ సమయంలో ట్రైన్ గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయింది. ఈ ట్రయల్ రన్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబయి, అహ్మదాబాద్ లేన్‌లోనే తొలి వందే సాధారణ్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది. టికెట్ ధరలు కూడా తక్కువే ఉండేలా చూసుకుంది రైల్వే. తక్కువ ఖర్చుతో సౌకర్యవంతంగా ప్రయాణించేలా అన్ని ఏర్పాట్లు చేసింది.
🚨 India's first Vande Sadharan train on trail run between Mumbai & Ahemdabad. (📸 - Anirudh27K) pic.twitter.com/a0735IZhx2
— Indian Tech & Infra (@IndianTechGuide) November 8, 2023
వందే సాధారణ్ హైలైట్స్ ఇవే..
వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌తో పోల్చుకుంటే వందే సాధారణ్ రైళ్ల టికెట్ ధరలు తక్కువ. ఇందులోనూ స్లీపర్ కోచ్‌లు ఉంటాయి. వీటితో పాటు సీటింగ్ సౌకర్యాల్లోనూ మార్పులు చేర్పులు చేశారు. కాస్త విశాలంగా ఉండేలా డిజైన్ చేశారు. ఈ వందే సాధారణ్ ట్రైన్స్‌కి (Vande Sadharan Trial Run) 22 కోచ్‌లుంటాయి. వీటిలోనే లగేజ్ వ్యాన్స్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్‌లు, నాన్ ఏసీ స్లీపర్ కార్స్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణించేందుకు అనువుగా ఉండనుంది. 1,800 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణించేలా సీట్‌లు ఏర్పాటు చేశారు. వందేభారత్‌తో పోల్చుకుంటే వందే సాధారణ్ ట్రైన్స్‌కి రెండు వైపులా ఇంజిన్స్ ఉంటాయి. అవకాశాన్ని బట్టి వీటిని వినియోగించుకోనున్నారు. ఈ రైళ్ల గరిష్ఠ వేగం 130 KMPH. 500 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ప్రయాణించే ఈ రైళ్లకి ఈ వేగం ఉండాలన్నది రైల్వే లెక్క. వీటితో పాటు సీసీ కెమెరాలు, సెన్సార్‌లూ ఉంటాయి. ప్రయాణికుల భద్రత కోసం వీటిని అమర్చారు. ముంబయి అహ్మదాబాద్ రూట్‌తో పాటు ముంబయి-న్యూఢిల్లీ, పట్నా-న్యూఢిల్లీ, హౌరా-న్యూఢిల్లీ, హైదరాబాద్-న్యూ ఢిల్లీ, ఎర్నాకులం-గువహటి రూట్‌లలోనూ వందే సాధారణ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపే యోచనలో ఉంది భారత రైల్వే.