Uttarakhand New CM: పాత సీఎంలకే భాజపా అధిష్ఠానం ఓటు- పుష్కర్, ప్రమోద్‌పైనే నమ్మకం
ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ధామీ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. గోవాలో ప్రమోద్ సావంత్‌ను సీఎంగా శాసనసభాపక్షం ఎన్నుకుంది.
ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై క్లారిటీ వచ్చింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకే మరోమారు పగ్గాలు ఇవ్వనున్నట్లు భాజపా ప్రకటించింది. సోమవారం సాయంత్రం దెహ్రాదూన్‌లో జరిగిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా కలిసి ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి భాజపా కేంద్ర పరిశీలకులు రాజ్‌నాథ్ సింగ్, మీనాక్షి లేఖీ, రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జి ప్రహ్లాద్ జోషి హాజరయ్యారు.
ఓడినా సీఎంగా
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించినప్పటికీ పుష్కర్ సింగ్ ధామీ ఓడిపోయారు. దీంతో అందరూ ధామీని సీఎం పదవి నుంచి తప్పిస్తారని అనుకున్నారు. కానీ భాజపా అధిష్ఠానం మాత్రం ధామీపై నమ్మకం ఉంచింది..
ఉత్తరాఖండ్‌లో కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే భాజపా ముగ్గురు సీఎంలను మార్చింది. అధికార పార్టీలో ఈ అస్థిరత ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావించింది. కానీ సీఎం పుష్కర్ సింగ్.. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని తాను ఓడినా పార్టీని గెలిపించారు.
అతి చిన్న వయసులో ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ధామీ.. పార్టీని విజయతీరాలకు చేర్చారు. అయితే ఓ సెంటిమెంట్ మాత్రం ఉత్తరాఖండ్‌లో మళ్లీ రిపీట్ అయింది.
ఉత్తరాఖండ్ సిట్టింగ్ సీఎంలెవరూ తర్వాతి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన దాఖలాలే లేవు. ఇప్పుడు ధామీ కూడా అలానే తన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కప్రి చేతిలో ఓటమిపాలయ్యారు.
ఫిబ్రవరి 14న జరిగిన అసెంబ్లీ ఎన్నికలో 70 స్థానాలకు గానూ 47 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది భాజపా. వరుసగా రెండోసారి అధికారాన్ని ఛేజిక్కించుకుంది.
గోవాలో
మరోవైపు గోవా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన భాజపా మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ప్రమోద్ సావంత్.. మరోమారు సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. పనాజీలో సోమవారం నిర్వహించిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 20 సీట్లీ సాధించి అతి పెద్ద పార్టీగా నిలిచింది. ఇద్దరు ఎంజీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.
Also Read: Bhagwant Mann Cabinet 2022: పంజాబ్‌లో శాఖల కేటాయింపు- ఆ కీలక శాఖ సీఎం చేతిలోనే
Also Read: Padma Awards 2022: భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్‌కు పద్మ విభూషణ్- ఆజాద్‌కు పద్మ భూషణ్