Yogi Adityanath Oath Date: యోగి ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్- కేబినెట్‌లో వీరికే చోటు!
ఉత్తర్‌ప్రదేశ్ సీఎంగా ఈ నెల 21న యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం.
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. మార్చి 21 సోమవారం యోగి.. వరుసగా రెండోసారి యూపీ పీఠం అధిరోహించనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత కొత్త కేబినెట్‌పై భాజపా కేంద్ర కార్యాలయంలో బుధవారం చర్చలు జరిగాయి. కేబినెట్ కూర్పును ఫైనల్ చేసినట్లు సమాచారం.
కేబినెట్ కూర్పు
ఇక చర్చలన్నీ ముగియడంతో మార్చి 21 మధ్యాహ్నం 3 గంటలకు యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఫిక్స్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే యోగి పాత కేబినెట్‌లో సరిగా పనిచేయని మంత్రులకు ఈసారి ఛాన్స్ లేదట.
2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ కూర్పు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రాంతాలు, వర్గాలు ఇలా అన్నింటినీ దృష్టిలో పెట్టుకునే మంత్రివర్గ కూర్పు చేశారట. మళ్లీ పాత ముఖాలనే కేబినెట్‌లో పెట్టేందుకు పార్టీ అధిష్ఠానం కూడా రెడీగా లేదని తెలుస్తోంది. మరోవైపు మిత్రపక్షం అప్నాదళ్ నుంచి ఇద్దరినీ, నిషాద్ పార్టీ నుంచి ఒకరిని యోగి తన కేబినెట్‌లోకి తీసుకోనున్నారు.
యూపీ భాజపా అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్‌కు కూడా కొత్త కేబినెట్‌లో చోటు దక్కనుంది.
ఇంకెవరంటే
కేశవ్ ప్రసాద్ మౌర్య, శ్రీకాంత్ శర్మ, సిద్ధార్థ్ నాథ్ సింగ్, నంద్ గోపాల్ నంది, బ్రజేష్ పాతక్, రాంపాల్ వర్మ, సూర్య ప్రతాప్ షాహి, అషుతోష్ టాండన్, మోహ్‌సిన్ రాజా, అనిల్ రాజ్‌భర్, సందీప్ సింగ్‌లను కొత్త కేబినెట్‌లోకి తీసుకోనున్నారు.
భారీ విజయం
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని భాజపా భారీ విజయాన్ని సాధించింది. వరుసగా రెండోసారి యూపీలో సర్కార్‌ను ఏర్పాటు చేయనుంది.
గోరఖ్‌పుర్ అర్బన్ నుంచి పోటీ చేసిన యోగి.. 1,03,390 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం యోగికి ఇదే తొలిసారి. యూపీ సీఎంగా ఐదేళ్ల పాటు పూర్తి పదవీకాలం పనిచేసి ఓ ముఖ్యమంత్రి తిరిగి అధికారంలోకి రావడం 37 ఏళ్లలో ఇదే తొలిసారి.
403 అసెంబ్లీ స్థానాల్లో 255 సీట్లు గెలుచుకుంది భాజపా. తన మిత్రపక్షం అప్నాదళ్ (ఎస్)కు 12 స్థానాలు దక్కాయి. మరో మిత్రపక్షం నిషాద్ పార్టీ 6 చోట్ల గెలుపొందింది.
మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన సమాజ్‌వాదీ పార్టీకి 111 సీట్లు దక్కాయి.
Also Read: Russia Ukraine News: అంతర్జాతీయ కోర్టులో రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటు- పర్లేదా మరి?