Viral News : రోటీ కారణంగా ఆగిన పెళ్లి -వెంటనే వేరే అమ్మాయితో మ్యారేజ్
UP News: పెళ్లికి రూ. 7 లక్షలు ఖర్చు చేశామని, అందులో రూ.1.5 లక్షలు కట్నంగా వరుడి ఇంటికి పంపామని అమ్మాయి కుటుంబం పేర్కొంది.
Viral News: ప్రజెంట్ జనరేషన్ లో పెళ్లి చేసుకున్నంత సేపు కూడా కలిసి ఉండడం లేదు. చిన్న చిన్న కారణాలతోనే విడిపోతున్న వాళ్లు ఎంతో మంది ఉంటున్నారు. ముఖ్యంగా ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. పెళ్లికి ముందు ఎలాంటి గొడవ జరిగినా ఓకే గానీ.. పెళ్లి తర్వాత జరిగితే ఆ నష్టం మరింత ఎక్కువ ఉంటుంది. అయితే కొన్ని సార్లు సిల్లీ మ్యాటర్స్ కి కూడా పెళ్లిళ్లు ఆగిపోతూ ఉంటాయి. తాజా అదే తరహా ఘటన చోటుచేసుకుంది. పెళ్లిలో రోటీలు ఆలస్యంగా వడ్డించారని వరుడితో పాటు అతని బంధువులు కూడా అక్కడ్నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆ పెళ్లి ఆగిపోవాల్సి వచ్చింది.
వివాహ వేడుకలో రోటీ వివాదం
ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లా హమీద్‌పూర్ గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకలో వరుడు భోజనం చేయడంలో జాప్యం కారణంగా వేడుకను విరమించుకున్న విచిత్ర ఘటన చోటుచేసుకుంది. డిసెంబర్ 22న పెళ్లి సంబరాలు ఎంతో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. వధువు కుటుంబీకులు బరాతీలకు మిఠాయిలతో స్వాగతం పలికి అనంతరం వారికి భోజనం వడ్డించారు. అయితే పెళ్లిలో ఆలస్యంగా రోటీలు వడ్డించారని వరుడి తరపు బంధువు వాదించారు. దీంతో పెళ్లి కొడుకు మెహతాబ్, అతని బంధువులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారిని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ, ఆలస్యానికి వధువు కుటుంబాన్ని నిందిస్తూ వరుడి తరపు వారు వేదికను విడిచిపెట్టినట్లు తెలుస్తోంది.
అనంతరం పెళ్లికొడుకు రాత్రికి రాత్రే అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత వారి బంధువుల్లోనే ఓ అమ్మాయిని వివాహం చేసుకున్నాడని, వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై జిల్లాలోని ఇండస్ట్రియల్ నగర్ పోలీస్ స్టేషన్‌లో మెహతాబ్‌పై ఫిర్యాదు నమోదైంది. అయితే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వధువు కుటుంబీకులు డిసెంబర్ 24న పోలీసు సూపరింటెండెంట్‌ను ఆశ్రయించారు. వరుడి తరఫు ఐదుగురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ - first information report) ఫైల్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వధువు కుటుంబం సీనియర్ పోలీసు అధికారిని అభ్యర్థించింది.
ఈ ఘటనపై స్పందించిన వధువు సోదరుడు రాజు.. ఎస్పీ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని, కుటుంబ సభ్యులను సంప్రదించమని పోలీసులకు సూచించగా, తమకు కాల్ రాలేదని చెప్పారు. అయితే అర్థాంతరంగా ఆగిపోయిన ఈ పెళ్లి కోసం తాము రూ.7లక్షలు ఖర్చు చేశామని తెలిపారు. రూ.1.5 లక్షలు కట్నంగా వారికిచ్చామన్నారు.
వరకట్న వ్యతిరేకంగా చట్టం
1961 వరకట్న నిషేధ చట్టం ప్రకారం కట్నం ఇచ్చేవారు, స్వీకరించేవారు లేదా కట్నం ఇవ్వడం లేదా స్వీకరించడంలో సహాయం చేసేవారు సైతం శిక్షను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ పెనాల్టీలో కనీసం రూ.15,000 జరిమానా లేదా వరకట్నం విలువ, ఏది ఎక్కువైతే అది కనీసం ఐదేళ్ల జైలు శిక్ష ఉంటుంది. ఈ చట్టం వరకట్న ఆచారాన్ని అరికట్టడం, దానితో సంబంధం ఉన్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది.