Yogi Adityanath Modi Meeting: ప్రధాని మోదీతో ఆదిత్యనాథ్ భేటీ- యోగి 2.0 కేబినెట్‌లో కీలక మార్పులు తప్పవా?
Yogi Adityanath Modi Meeting: కేబినెట్ ఏర్పాటు సహా ప్రమాణస్వీకార కార్యక్రమం గురించి ప్రధాని మోదీతో యోగి చర్చించనున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తొలిసారి దిల్లీలో పర్యటిస్తున్నారు యోగి ఆదిత్యనాథ్. కొత్త కేబినెట్ ఏర్పాటు సహా కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ సహా పార్టీ అధిష్ఠానంతో యోగి చర్చించనున్నారు.
ప్రమాణ స్వీకారం
ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయాలి సహా కేబినెట్ ఏర్పాటుపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో యోగి చర్చించనున్నారు.
భారీ విజయం
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని భాజపా భారీ విజయాన్ని సాధించింది. వరుసగా రెండోసారి యూపీలో సర్కార్‌ను ఏర్పాటు చేయనుంది.
గోరఖ్‌పుర్ అర్బన్ నుంచి పోటీ చేసిన యోగి.. 1,03,390 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం యోగికి ఇదే తొలిసారి. యూపీ సీఎంగా ఐదేళ్ల పాటు పూర్తి పదవీకాలం పనిచేసి ఓ ముఖ్యమంత్రి తిరిగి అధికారంలోకి రావడం 37 ఏళ్లలో ఇదే తొలిసారి.
403 అసెంబ్లీ స్థానాల్లో 255 సీట్లు గెలుచుకుంది భాజపా. తన మిత్రపక్షం అప్నాదళ్ (ఎస్)కు 12 స్థానాలు దక్కాయి. మరో మిత్రపక్షం నిషాద్ పార్టీ 6 చోట్ల గెలుపొందింది.
మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన సమాజ్‌వాదీ పార్టీకి 111 సీట్లు దక్కాయి.
అడ్రస్ గల్లంతు
మరోవైపు భాజపా దెబ్బకు కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీలు కొట్టుకుపోయాయి. యూపీ చరిత్రలో ఎన్నడూలేనంత తక్కువ సీట్లు సాధించాయి. కాంగ్రెస్ రెండంటే రెండు సీట్లలో గెలుపొందితే, బీఎస్పీ ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 7 సీట్లు, బీఎస్సీ 19 సీట్లు పొందాయి. సీట్లు పెరగకపోగా దారుణంగా తగ్గడం ఆ పార్టీల శ్రేణులను నిరాశ పరుస్తోంది.
Also Read: AAP Roadshow Amritsar: ఆప్ విజయోత్సవ ర్యాలీ- పంజాబ్‌లో చారిత్రక నిర్ణయాలు ఖాయమట!