Jaishankar: ఇవే తగ్గించుకుంటే మంచిది, కెనడాకు విదేశాంగమంత్రి జైశంకర్ చురకలు
India Canada News | ఖలీస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో మొదలైన భారత్, కెనడా మధ్య విభేదాలు ఇంకా సమసిపోలేదు. కెనడాది ద్వంద్వ వైఖరి అని, తీరు మార్చుకోవాలని జయశంకర్ సూచించారు.
Union Minister S Jaishankar | న్యూఢిల్లీ: ఖలిస్థానీ వేర్పాటువాది హర్‌దీప్ సింగ్ నిజ్జార్ హత్యతో భారత్, కెనడా మధ్య చెలరేగిన వివాదం ఇంకా సద్దుమణగలేదు. 2023 జూన్ లో హర్‌దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు గురికాగా, ఇందుకు కారణం భారత్ అని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఈ విషయంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం మాట్లాడుతూ.. కెనడా ద్వంద్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. నిజ్జార్ హత్య కేసు దర్యాప్తుపై న్యూఢిల్లీ, ఒట్టావా మధ్య కొనసాగుతున్న విభేదాలపై స్పందించిన జైశంకర్ కెనడా తీరును మరోసారి తప్పుపట్టారు. కెనడా తమ తీరు మార్చుకోవాలని ఆయన సూచించారు.
ఎన్‌డీటీవీ వరల్డ్ సమ్మిట్ లో పాల్గొన్న సమయంలో జైశంకర్ మాట్లాడుతూ.. నిజ్జర్ హత్య విషయంలో కెనడాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కెనడాలో ఏం జరుగుతుందో, అక్కడున్న భారతీయుల భద్రత, సంక్షేమంపై మన అధికారులు జోక్యం చేసుకోవడంతో కెనడాకు సమస్యగా కనిపిస్తుందన్నారు. "కెనడాకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయని నేను భావిస్తున్నాను.. భారత హైకమిషనర్‌పై పోలీసు విచారణ చేపట్టాలని కెనడా కోరుతోంది. అందుకు ప్రతిస్పందనగా మేం కెనడాలో భారత హైకమిషనర్, దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. భారతీయ దౌత్యవేత్తలతో కెనడాకుు సమస్యలు ఎందుకు వస్తున్నాయో మాకు అర్థం కావడం లేదు. కెనడాలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించడంతో అక్కడి ప్రభుత్వానికి ఇబ్బందిగా అనిపిస్తోందని’ జైశంకర్ ఆ సమావేశంలో అన్నారు.
భారత దౌత్యవేత్తలపై కెనడాలో ఆంక్షలు
‘భారత్ విషయానికి వస్తే.. కెనడా దౌత్యవేత్తలు, అధికారులకు ఇక్కడ ఎలాంటి సమస్య లేదు. కానీ మన ఆర్మీ అధికారులు, పోలీసులు, ఇతర కీలక వ్యక్తుల సమాచారాన్ని సేకరించి కెనడాలో ఆపివేయాలని చూస్తున్నారు. కెనడాలోని భారత దౌత్యవేత్తలపై వారు విధించే ఆంక్షలు భిన్నంగా ఉన్నాయి. కెనడా ద్వంద్వ వైఖరిని ఇకనైనా వీడాలి. ఒట్టావా వాక్ స్వాతంత్య్రాన్ని వాడుతూ భారత నేతలు, అధికారులపై బహిరంగంగానే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కెనడాలోని భారతీయ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తే, దాన్ని కూడా అక్కడి ప్రభుత్వం విదేశీ జోక్యంగా పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు’ జైశంకర్.
భారత నాయకులు, దౌత్యవేత్తలను బహిరంగంగా బెదిరిస్తున్నారని మేం వారికి చెబితే.. వారి సమాధానం వాక్ స్వాతంత్ర్యం అని వచ్చినట్లు తెలిపారు. కెనడా, భారత్ మధ్య సమస్యా ఉందా అంటే దురదృష్టవశాత్తూ అవునని చెప్పాల్సి వస్తోందన్నారు. 1945 తర్వాత పాశ్చాత్య సమస్యలు ఎక్కువగా ఉత్పన్నం అవుతున్నాయని, గత 20-25 సంవత్సరాలలో ఏం జరిగింతో గమనిస్తే విషయం తెలుస్తుందన్నారు. వెస్ట్రన్, నాన్ వెస్ట్రన్ దేశాల సమీకరణాలు మారుతున్నాయి. ఆధిపత్య ధోరణి ఎవరికీ మంచిది కాదని హితవు పలికారు.
నిజ్జర్ హత్యతో మనకు లింకేంటి? మరి సాక్ష్యాలెక్కడ
నిజ్జర్ హత్య కేసుతో కెనడాలోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ, మరికొందరు భారత దౌత్యవేత్తలకు కెనడా ప్రభుత్వం లింక్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో భారత్ లో ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను గత వారం బహిష్కరించింది. దాంతోపాటు కెనడాలో భారత హైకమిషనర్‌ను ఉపసంహరించుకుంది. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలను భారత్ తో కెనడా ప్రభుత్వం పంచుకోలేదు. కానీ ఉద్దేశపూర్వకంగా భారత్ ప్రమేయం ఉందని ఆరోపణలు చేస్తుందని జైశంకర్ చెప్పుకొచ్చారు.
Also Read: India-Canada Relations: ఆధారాలతోనే మాట్లాడుతున్నామంటూ భారత్‌పై మరోసారి విషం చిమ్మిన కెనడా