Train Accident: ఉత్తర ప్రదేశ్‌లో రైలులో చెలరేగిన మంటలు, రెండు కోచ్‌లు దగ్ధం
Train Accident: ఉత్తర ప్రదేశ్‌లో రైలు ప్రమాదం జరిగింది. ఆగ్రా జిల్లాలోని మల్పురా పోలీస్ స్టేషన్‌లోని భదాయి రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం 3.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
Train Accident: ఉత్తర ప్రదేశ్‌లో రైలు ప్రమాదం జరిగింది. ఆగ్రా జిల్లాలోని మల్పురా పోలీస్ స్టేషన్‌లోని భదాయి రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం 3.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్ (14624) రైలులోని రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. మంటల్లో ఇంజిన్ నుంచి మూడు, నాలుగు బోగీల్లో కాలిపోయాయి. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని ఆగ్రా రైల్వే డివిజన్ పీఆర్వో ప్రశస్తి శ్రీవాస్తవ తెలిపారు.
మొత్తం నాలుగు కోచ్‌లను రైలు నుంచి వేరు చేశామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.
కొన్ని రోజుల కిందట మహారాష్ట్రలో కూడా ఓ రైలు ఘోర అగ్నిప్రమాదానికి గురైంది. బీడ్ జిల్లాలోని ఆష్టి స్టేషన్ నుంచి అహ్మద్ నగర్‌కు వెళ్తున్న డెము రైలులోని 5 కోచ్‌లలో మంటలు చెలరేగాయి. అహ్మద్‌నగర్, నారాయణ్‌పుర్ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. మంటలు వ్యాపించగానే రైలులో ఉన్నవారిని కిందకు దించినట్లు చెప్పారు. మంటలు చెలరేగిన కోచ్‌లలో ఎవరూ చిక్కుకోలేదని, అధికారులు వెంటనే అగ్నిమాపక బృందాలకు సమాచారం అందించారని వివరించారు.
#UPDATE | Smoke was reported on the train Patalkot Express between Agra- Dholpur. The smoke was noticed in the GS coach, 4th coach from the engine. The train was immediately stopped and Coach detached. No injuries to any person: Indian Railways pic.twitter.com/SgAwZ7t7RF
— ANI (@ANI) October 25, 2023
గుజరాత్‌లో..
గుజరాత్‌లో ఇటీవల రైలులో మంటలు ఎగశాయి. వల్సాడ్‌లో హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. తిరుచిరాపల్లి-శ్రీ గంగానగర్ మధ్య ఈ రైలు నడుస్తోంది. ఇది వల్సాడ్ స్టేషన్ సమీపంలోకి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలుకు చెందిన బ్రేక్ వ్యాన్ కోచ్‌లో మధ్యాహ్నం సమయంలో మంటలు ప్రారంభమయ్యాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. దీంతో పక్క బోగీల్లోని ప్రయాణికులందరినీ వెంటనే దించేశారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.
రాజస్తాన్‌లో ప్రమాదం..
రాజస్తాన్‌లోని దౌసా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్తున్న జైపూర్ ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. రాత్రి వేళ సీ5 కోచ్‌లోని వీల్స్ వద్ద మంటలు రాజుకున్నాయి. దౌసా స్టేషన్‌కు చేరడంతో కోచ్ వీల్స్ వద్ద నిప్పురవ్వలను రైల్వే సిబ్బంది గమనించారు. అప్రమత్తమైన వారు వెంటనే ఆ మంటలను ఆర్పివేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ రైలులోని ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు. అయితే మంటలు ఆర్పివేసిన తర్వాత ఆ రైలు తన ప్రయాణాన్ని కొనసాగించింది.
బెంగళూరులో..
కర్ణాటక రాజధాని బెంగళూరులోని సంగోల్లి రాయన్న రైల్వే స్టేషన్‌లో ఉద్యాన ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. రైలు స్టేషన్‌కు చేరుకున్న తర్వాత ఏసీ కోచ్ లో మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్టేషన్ ఆవరణలోని ప్రయాణికులు పరుగులు తీశారు.
ఆంధ్రప్రదేశ్‌లోను ఇలాంటి ఘటనే జరిగింది. నిడదవోలు - నరసాపురం ప్యాసింజెర్ ట్రైన్‌లో మంటలు ఎగశాయి. దీంతో ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన అధికారులు రైలును ఉండ్రాజవరం మండలం సత్యవేడులో నిలిపివేశారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.