Cyrus Mistry Funeral : నేడు ముంబయిలో సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు
Cyrus Mistry Funeral : రోడ్డు ప్రమాదంలో మరణించిన టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు నేడు ముంబయిలో నిర్వహించనున్నారు.
Cyrus Mistry Funeral : టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు సెప్టెంబర్ 6 (మంగళవారం) ముంబయిలోని వర్లీ శ్మశానవాటికలో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులో ఓ ప్రకటన విడుదల చేశారు. 54 ఏళ్ల వ్యాపార దిగ్గజం సైరస్ మిస్త్రీ ఆదివారం ముంబాయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజామున మిస్త్రీ, జహంగీర్ పండోల్ మృతదేహాలను కాసా ఆసుపత్రి నుంచి ముంబయిలోని జేజే ఆసుపత్రికి తీసుకువచ్చి, పోస్టుమార్టమ్ నిర్వహించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో గాయపడిన అనాహిత పండోల్, ఆమె భర్త డారియస్ పండోల్‌లను మెరుగైన చికిత్స కోసం వాపి నుంచి ముంబయిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసు అధికారి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సైరస్ మిస్త్రీని కాసాలోని కాసా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో తలకు గాయమై అంతర్గత రక్తస్రావం జరిగిందని వైద్యులు తెలిపారు. మిస్త్రీని ఆసుపత్రి తరలించేలోపే మార్గమధ్యలో మరణించారని వైద్యులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ ఇక లేరు. ఆదివారం ఆయన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ముంబయి సమీపంలోని పాల్ఘడ్‌లో ఆయన కారు ప్రమాదానికి గురైంది. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. డ్రైవర్ సహా ఆయనతో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని గుజరాత్‌లోని ఆస్పత్రికి తరలించారు. 'టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అహ్మదాబాద్ నుంచి ముంబయికి వెళ్తుండగా ఆయన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. మొత్తం నలుగురు ప్రయాణిస్తున్నారు. ఘటనా స్థలంలోనే ఇద్దరు మరణించగా మరో ఇద్దరిని ఆస్పత్రికి తీసుకెళ్లారు' అని పోలీసులు వెల్లడించినట్టు ఏఎన్‌ఐ రిపోర్టు చేసింది. అహ్మదాబాద్ నుంచి ముంబయికి మెర్సిడేస్ వాహనంలో ప్రయాణిస్తుండగా సాయంత్రం 3:15 గంటలకు ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. సూర్య నదిపై బ్రిడ్జీపై ప్రమాదం చోటు చేసుకుందని వివరించారు. టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి 2012లో రతన్ టాటా తప్పుకున్నారు. పల్లోంజీ మిస్త్రీ కుమారుడైన సైరస్ మిస్త్రీ ఆ బాధ్యతలను స్వీకరించారు. నాలుగేళ్ల తర్వాత ఆయన్ను పదవిలోంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆయన ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తుండటం గమనార్హం.
చిన్న వయసులోనే వ్యాపార ప్రపంచంలోకి
చిన్న వయసులోనే ఆయన వ్యాపార ప్రపంచంలో అడుగుపెట్టారు. అనుకోని సవాళ్లు ఎన్నింటినో అలవోకగా అధిగమించారు. తన తెలివితేటలు, నైపుణ్యాలు, చాకచక్యంతో ఉద్దండుల ప్రశంసలు అందుకున్నారు. తన దార్శనికతతో అందరినీ ఫిదా చేశారు. భవిష్యత్తు మార్గదర్శకుడిగా ఏకంగా టాటా గ్రూప్ ఛైర్మన్ పదవి చేపట్టారు. అనూహ్యంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చినా వెరవలేదు. న్యాయపోరాటానికి దిగారు. ఆయనే సైరస్ మిస్త్రీ!
కలిచివేసిన హఠాన్మరణం
సైరస్ మిస్త్రీ ఆదివారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారని తెలియడంతో వ్యాపార ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ముంబయి సమీపంలోని పాల్ఘడ్‌లో ఆయన కారు ప్రమాదానికి గురైంది వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. అకాల మరణంతో ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయిన మిస్త్రీ, ఆయన దార్శనికతను వ్యాపార ప్రపంచం కన్నీటితో తలుచుకుంటోంది.
Also Read: షాకింగ్ న్యూస్! ప్రమాదంలో టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ హఠాన్మరణం!